మూడేళ్ల ముందు నుంచే ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్న మోడీ బ్యాచ్

Sat Jul 31 2021 11:24:23 GMT+0530 (IST)

The Modi batch has been preparing for the election campaign

మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికలకు సంబంధించి మోడీ అండ్ కో ఎంత అలెర్టుగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పక్కా ప్లానింగ్ తో తాము గురి పెట్టిన ఎన్నికల్ని విజయవంతంగా పూర్తి చేయటానికి వీలుగా సరంజామాను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పశ్చిమబెంగాల్ లాంటి ప్రత్యేక పరిస్థితులు తప్పించి.. చాలావరకు మోడీషాల ఎన్నికల వ్యూహాలు పక్కాగా వర్కువుట్ చేయటం తెలిసిందే. మరో మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరటానికి..అరుదైన హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. ఒకవేళ పాదయాత్రలు లాంటివి చేపట్టేందుకు.. ప్రజల్లో ఎన్నికల మూడ్ తేవటానికి ఏడాదిన్న.. రెండేళ్ల ముందు నుంచి ప్రత్యేక కార్యాచరణను చేపడతారు. అందుకు భిన్నంగా.. మూడేళ్ల ముందు నుంచే ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేయటం ఆసక్తికరంగా మారింది.

మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీనే రంగం సిద్ధం చేసుకోవటం మొదలు పెట్టిందంటే.. మిగిలిన పార్టీలు కూడా ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తాయని చెప్పక తప్పదు. ఇక.. బీజేపీ ఎన్నికల రోడ్ మ్యాప్ చూస్తే.. కేబినెట్ మంత్రుల్ని 19 రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ యాత్రలు నిర్వహించేందుకు వీలుగా సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆగస్టు 16 నుంచి 43 మంత్రులు యాత్రలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కేంద్ర మంత్రులు చేపట్టే యాత్రలు మొత్తంగా 15వేల కిలోమీటర్లు కవర్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు. ఒక్కొక్కరు 300 నుంచి 400 కిలో మీటర్ల మధ్య వారి యాత్ర సాగుతుందని చెబుతున్నారు. కేంద్రమంత్రులు ప్రతి ఒక్కరు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం నుంచి 300 - 400 కిలోమీటర్ల దూరం నుంచి యాత్రను షురూ చేసే వీలుంది. దీంతో ఒక్కో కేంద్రమంత్రి కనీసం మూడు నాలుగు లోక్ సభా నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా రోడ్ మ్యాప్ ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని పార్టీ నేతల్లో.. కార్యకర్తల్లో కొత్త  జోష్ ఖాయమంటున్నారు.

ఈ యాత్రలు ఎక్కువగా పార్టీ విజయవకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ.. యూపీ.. ఢిల్లీ.. బిహార్.. రాజస్థాన్.. గుజరాత్.. ఉత్తరాఖండ్.. తమిళనాడు.. ఒడిశా.. మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. పశ్చిమబెంగాల్.. కర్ణాటకల్లో ఉంటాయని తెలుస్తోంది. మరి.. బీజేపీ అగ్రనేతలైన మోడీ.. అమిత్ షా.. జేపీ నడ్డాలు కూడా మధ్య మధ్యలో ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాల్ని చేపట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. సో.. సార్వత్రిక ఎన్నికల వేడి రగలటానికి ఎక్కువ సమయం తీసుకోదన్న మాట. 2024లో జరిగే ఎన్నికలకు.. ఇప్పటి నుంచే రాజకీయ వేడి మొదలైతే.. పాలనా పరంగా మోడీ సర్కారు బండి వేగం నెమ్మదించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.