Begin typing your search above and press return to search.

పీత‌ల సుజాత ఎఫెక్ట్‌.. టీడీపీపై ఎస్సీల గుస్సా!

By:  Tupaki Desk   |   20 Oct 2020 4:45 AM GMT
పీత‌ల సుజాత ఎఫెక్ట్‌.. టీడీపీపై ఎస్సీల గుస్సా!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ప్ర‌క్షాళ‌న ఘ‌ట్టం పూర్త‌యిపోయింది. `బీసీ దేశం`గా మారుస్తూ.. చంద్ర‌బా బు భారీ సంఖ్య‌లో బీసీల‌కు అవ‌కాశం క‌ల్పించారు. మంచిదే. అయితే, పార్టీలో క‌మిట్ మెంట్‌గా ప‌నిచేస్తున్న‌వారికి అవ‌కాశం ఇచ్చారా? చంద్ర‌బాబు ఎన్ని అవ‌మానాల‌కు గురి చేసినా.. పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేస్తున్న‌వారికి ఛాన్స్ ల‌భించిందా? అంటే.. ఎవ‌రి మాట ఏమో కానీ.. మా నాయ‌కురాలికి మాత్రం అన్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం తెలుగు దేశం పార్టీ నాయ‌కులు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్సీ నాయ‌కురాలు.. మాజీ మంత్రి పీత‌ల సుజాత‌కు చంద్ర‌బాబు ఎలాంటి ప‌ద‌వీ ఇవ్వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


రాజ‌కీయాల్లో నేటి త‌రం నేత‌లు ఓకే పార్టీలో నిల‌బ‌డ‌డం, అంకిత భావంతో ప‌నిచేయ‌డం వంటివి చాలా అరుదుగా క‌నిపించే విష‌యాలే. పైగా..పార్టీలో లేదా.. అధిష్టానం నుంచి త‌మ‌కు అవ‌మానం జ‌రుగుతోం ద‌నే సంకేతాలు వ‌స్తే.. ఖ‌చ్చితంగా వారు రోడ్డున ప‌డిపోతారు. త‌మ ఇమేజ్‌కు డ్యామేజీ చేస్తున్నార‌ని గ‌గ్గోలు పెట్టి.. అదిష్టానాన్ని.. పార్టీ సీనియ‌ర్ల‌ను సైతం డిఫెన్స్‌లో ప‌డేస్తారు. అవ‌మానాలు భ‌రించాలా? అంటూ.. నిల‌దీత‌లు కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇలాంటి అనేక అవ‌మానాలు ఎదురైనా.. పీతల సుజాత త‌ట్టుకుని నిలిచారు. అంతేకాదు.. పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు. కానీ, ఆమెకు మ‌రోసారి చంద్ర‌బాబు ఉత్త చెయ్యే చూపించారు. దీంతో సుజాత సానుభూతిప‌రులు, ఆమె మ‌ద్ద‌తు దారులు.. బాబుపై ఆగ్ర‌వేశాలు వ్య‌క్తం చేస్తున్నారు.

సుజాత పొలిటిక‌ల్ లైఫ్ చూస్తే.. టీచ‌ర‌మ్మ‌గా ఉన్న సుజాత 2004లో పార్టీ త‌ర‌ఫున ఆచంటం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆమెకు టికెట్ ఇవ్వ‌లేదు. ఇది తొలి అవ‌మానంగా అప్ప‌ట్లోనే ఆమె స‌న్నిహితులు పేర్కొన్నారు. అయితే, ఆమె మ‌న‌సు మార్చుకోలేదు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌కున్నా.. కాంగ్రెస్ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా.. క‌మిట్‌మెంట్‌ను ప్ర‌ద‌ర్శించారు. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఎస్సీ వ‌ర్గాల‌ను చేరువ చేసేందుకు సుజాత ప్ర‌య‌త్నించారు. ఇక‌, 2014లో చింత‌లపూడి టికెట్ ఇవ్వ‌డంతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ వెంట‌నే మంత్రిప‌ద‌విని ఇచ్చారు చంద్ర‌బాబు.

అయితే, స్వ‌ల్ప ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో 2017లో మాట మాత్రం కూడా చెప్ప‌కుండానే సుజాత‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. అయినా.. పీత‌ల ఎక్క‌డా ఆత్మ‌స్థ‌యిర్యం కోల్పోకుండా ముందుకు సాగారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మ‌రోసారి పీత‌ల‌కు అవ‌మారం ఎదురైంది. టికెట్ వ‌స్తుంద‌ని ఆశించినా.. చివ‌రి నిముషం వ‌ర‌కు ఊరించి టికెట్ ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో సుజాత ప్లేస్‌లో ఎవ‌రైనా ఉండి ఉంటే.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారు. కానీ, సుజాత మ‌రింత ప‌ట్టుద‌ల‌తో పార్టీ కోసం ప‌నిచేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమెను చంద్ర‌బాబు గుర్తించ‌లేదు. ఇది ఎస్సీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఎస్సీల్లో వంగ‌ల‌పూడి అనిత‌.. వ‌ర్ల రామ‌య్య‌కు పార్టీ ప‌ద‌వులు ఇచ్చినా.. మాస్ ఎస్సీ నాయ‌కురాలిగా పేరున్న‌ పీత‌ల సుజాత‌కు ఇవ్వ‌క‌పోవ‌డం ఎస్సీ వ‌ర్గాల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.