చంద్రబాబుకు చెప్పే బీజేపీలో చేరుతున్నా

Wed Sep 11 2019 22:15:56 GMT+0530 (IST)

Tdp Ex Minister Adinarayana Reddy May Join BJP

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. అంతే కాదు.. నేను టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడిని కలిసింది నిజమే.. ఆయనతో  నేను టీడీపీలో కొనసాగలేను.. అందుకే బీజేపీలో చేరుతానని చెప్పి వచ్చానని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తుంది. అంటే చంద్రబాబు డైరెక్షన్ లోనే టీడీపీలో ఎంపికైనా ఎంపీల కనుసన్నల్లో ఈ చేరికలు ఉంటున్నాయన్నమాట. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బీజేపీలో తలదాచుకుని ఎన్నికల సమయంలో తిరిగి సొంతగూటికి వచ్చే కార్యక్రమానికి తెరతీసినట్లుగా ఆదినారాయణ రెడ్డి వ్యవహారం తరువాత అసలు విషయాలు బట్టబయలవుతున్నాయి.ఇప్పుడు కడపకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరికను స్పష్టం చేశారు. కాకుంటే కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు బీజేపీ - ఆదినారాయణ రెడ్డి అనుచరులు - ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వచ్చేలా ప్రయత్నించింది కడపకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనే టాక్ ఉన్నప్పటికి ఆదినారాయణ రెడ్డి జగన్ పై ఉన్న కోపంతోనే బీజేపీకి బాటేసుకున్నాడని దాన్ని సీఎం రమేష్ ఖాతాలో జమ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.  ఈ నెల 14న ప్రొద్దుటూరులో జరిగే రాయలసీమ జిల్లాల సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విచ్చేస్తున్న నేపధ్యంలో ఆ రోజు కొందరు బీజేపీలో చేరుతున్నారు.

తాను టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడింది నిజమే. ఇక టీడీపీలో కొనసాగలేనని చెప్పి వచ్చాను. సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆలోచన మారడం కొంత బాధించింది. గత ఎన్నికల్లో ఆర్థిక విషయాలన్నీ పార్టీ వారే చూసుకుంటామన్నారు. కడప లోక్ సభ పరిధిలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగలేదు. ఎంపిక సరిలేదని ఎంత చెప్పినా అధిష్టానం వినలేదు. ఒక్క పులివెందులలో మాత్రం సాహసం చేశారు. మిగిలినవారెవ్వరూ ఎన్నికల సమయంలో సరిగా డబ్బు ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ ప్రధానంగా ఓటమికి కారణాలు. చంద్రబాబును కలిసినప్పుడు నేను బీజేపీలో చేరుతానని చెప్పాను. గతంలో నా కుటుంబం వద్దన్నా చంద్రబాబు మాటకు విలువిచ్చాను. నేను డబ్బు - లెక్క చూసుకుంటాను అన్నారు. ఏం చూసుకున్నారు ? కేసులు రాజీ పడమన్నారు. పడ్డాను. ఎంపీగా పోటీ చేయమంటే పోటీ చేశాను. ఎంతో నష్టపోయి ఇబ్బందులు పడ్డానని బాబుకు చెప్పానని ఆదినారాయణరెడ్డి చెప్పడం విశేషం.

మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతున్నానని ప్రకటించినా ఆయన చేరిక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డి ఇటీవల హైదరాబాదులో బీజేపీ నేత జేపీ నడ్డాను కలిసినట్లు సమాచారం. ఆ తరువాత బీజేపీ అగ్రనేత - కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికి - అగ్రనేతల నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. బీజేపీలో చేరడం ఖాయమని ఆదినారాయణ రెడ్డే స్వయంగా ప్రకటించాడు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అనుచరులు - అభిమానులతో సమావేశం నిర్వహించి అమిత్ షా సమక్షంలో ఆది బీజేపీలో చేరేలా నిర్ణయించినట్లు సమాచారం.