Begin typing your search above and press return to search.

కమ్మ నేతల షాకులతో వణికి పోతున్న టీడీపీ

By:  Tupaki Desk   |   15 Nov 2019 11:06 AM GMT
కమ్మ నేతల షాకులతో వణికి పోతున్న టీడీపీ
X
ఎవరు అవునన్నా.. కాదన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల కు సంబంధించి ఒక ప్రాధమిక వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. తెలంగాణ లో పోలిస్తే ఏపీలో కులాభిమానం చాలా ఎక్కువ. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎవరైనా కలిసిన వెంటనే.. కొత్త పాత అన్న తేడా లేకుండా మీదే కులమన్న ప్రశ్న ను ఎవరికి వారు తమదైన శైలిలో అడుగుతారు. అంతలా కులం గురించి తెలుసుకోవాలన్న తపన వారిలో మాత్రమే కనిపిస్తుంది. తెలంగాణ లో కులం మీద కంటే ప్రాంతీయ అభిమానం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది.

తెలంగాణ లో తామంతా ఒక్కటన్నట్లు ఉంటే.. ఏపీ వరకూ వస్తే మాత్రం కులం.. ఉత్తరాంధ్ర.. రాయలసీమ.. కోస్తా.. ఇలా ముక్కలు చెక్కలుగా కనిపిస్తాయి. ఇన్ని అవలక్షణాలతో పాటు.. ఏపీలోని రాజకీయాలు కులం చుట్టూనే తిరుగుతాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు దేశం పార్టీ లో కమ్మల కు పెద్దగా ఆదరింపు లేదనే చెప్పాలి. బీసీలు.. మైనార్టీల కు ఆ పార్టీ లో ప్రాధాన్యత ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు పార్టీ లో ఎంట్రీ ఇచ్చి.. మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారో.. పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం షురూ అయ్యింది.

నిజానికి బీసీల పార్టీగా ఉన్న టీడీపీని.. కమ్మల పార్టీగా మార్చేసిన ఘనత చంద్రబాబుదే. ఆయన హయాం లో పార్టీలో కులాభిమానం పెరిగిపోవటమే కాదు.. తాను అత్యంత సన్నిహితంగా ఉండే నేతలంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావటం.. ఆ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసిన వైనం తో ఇతర వర్గాల్లో గుర్రు అంతకంతకూ పెరిగిందని చెప్పాలి.

నిజానికి ఇదే 2004.. 2009లోనే చివరకు 2019లోనూ టీడీపీ పరాజయానికి కారణం గా చెప్పాలి. ఏ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని తలకెత్తుకొని.. పార్టీ మొత్తం వారి మీదే ఉన్నట్లుగా బిల్డప్ ఇచ్చారో.. ఇప్పుడు అదే నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి.. వేర్వేరు పార్టీల్లో చేరిపోవటం కనిపిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత దారుణమైన పరాజయానికి గురైన టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా పార్టీని వదిలేస్తున్నారు.

ఏ సామాజిక వర్గాన్ని నెత్తిన ఎక్కించుకొని పార్టీని నిర్వీర్యం చేశారో.. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన నేతల కారణంగా దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయంటున్నారు. ఇప్పటివరకూ టీడీపీకి బ్యాక్ అప్ కమ్మ సామాజిక వర్గంగా చెప్పేవారు. ఆ తర్వాత బీసీలన్న మాట వినిపించేది.

తాజాగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు పలువురు ఎవరి దారి వారు చూసుకుంటూ వివిధ పార్టీల్లో చేరిపోవటం చూస్తే.. ఇప్పుడా పార్టీ తీవ్రమైన సంక్షోభం దిశగా అడుగులు వేస్తుందని చెప్పక తప్పదు. కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం ద్వారా.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు పార్టీని వదలటం ఒక ఎత్తు అయితే.. తాజాగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా పార్టీని విడిచిపెట్టి వెళ్లటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ పార్టీ ఒక గురుతుగా మారుతుందా? అన్న సందేహం కలుగక మానదు.

ఎందుకిలా జరిగింది? అంటే.. బాబు నిర్ణయాలే కారణంగా చెబుతున్నారు. పార్టీని సైద్దాంతిక భావ జాలంతో నడపాలే తప్పించి.. కుల రాజకీయాలు చేస్తే ఇలాంటి దిక్కు మాలిన పరిస్థితే ఏర్పడుతుందంటున్నారు. తాజా సంక్షోభం నుంచి పార్టీ ఎలా బయటపడుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.