బ్రాండ్ ఇమేజ్ కు జరిగే నష్టమే రూ.1.88 లక్షల కోట్లు

Tue Jun 02 2020 09:45:16 GMT+0530 (IST)

Tata ranks 85th among 100 most valuable global brands

ప్రపంచవ్యాప్తంగా కమ్మేసిన మహమ్మారి కారణంగా జరిగే నష్టాన్ని లెక్కించటం అంత తేలికైన వ్యవహారం కాదేమో. తాజాగా ఒక అధ్యయనం వెల్లడించిన వివరాల్ని చూస్తే.. ఈ భావన కలగటం ఖాయం. ప్రపంచ వ్యాప్తంగా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరిని ప్రభావితం చేసిన బ్రాండ్ ఇమేజ్ లెక్కలు కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. దేశీయంగా ఉన్న టాప్ 100 బ్రాండ్ల విలువకు భారీ గండి పడినట్లుగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఇది రూ.1.88 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.2020 జనవరి ఒకటి నాటికి బ్రాండ్ల విలువ మొత్తంలో 15 శాతానికి సిమాగంగా చెబుతున్నారు. గడిచిన కొద్ది నెలల్లో చోటు చేసుకునే పరిణామాలతో దేశీ టాప్ 100 బ్రాండ్ల విలువ 2500 కోట్ల డాలర్ల నుంచి వెయ్యి కోట్ల డాలర్లకు తగ్గిపోవచ్చన్న మాట వినిపిస్తోంది. టాప్ 100 బ్రాండ్ల విషయానికి వస్తే.. టాప్ 10లో కొన్ని కంపెనీలు తమ ఇమేజ్ ను పెంచుకోవటంతో పాటు.. స్వల్పంగా పెరగటం విశేషం. ఇప్పుడున్న సంక్షోభంలోనూ తమ సత్తా చాటిన తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ప్రపంచంలో టాప్ 100 బ్రాండ్లలో స్థానం దక్కించుకున్న టాటా గ్రూపు.. వరల్డ్ వైడ్ గా 85వ స్థానంలో ఉంది. భారత్ లో ఈ బ్రాండ్ ఏకంగా మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. వంద దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించే టాటా గ్రూపులో 7.20లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న సంక్షోభంలోనూ టాటా బ్రాండ్ ఇమేజ్ పెద్దగా ప్రభావితం కాలేదని చెబుతున్నారు. 2019లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టాటా గ్రూపు.. తాజాగా కూడా మొదటిస్థానంలో నిలవటం విశేషం. అంతేకాదు.. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగింది కూడా.

దేశంలో టాప్ టెన్ బ్రాండ్లుగా టాటా తొలిస్థానంలో.. రెండో స్థానంలో ఎల్ఐసీ.. మూడోస్థానంలో రిలయన్స్ నిలిచింది. వాస్తవానికి 2019లో మూడో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ నాలుగో స్థానానికి వెళ్లగా.. అప్పట్లో నాలుగో స్థానంలో ఉన్న రిలయన్స్ మూడోస్థానానికి ఎగబాకింది. తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్ బీఐ.. హెచ్ డీఎఫ్ సీలు నిలిచాయి. ఏడో స్థానంలో మహీంద్రా గ్రూపు.. ఎనిమిదో స్థానంలో ఇండియన్ ఆయిల్.. తొమ్మిదో స్థానంలో హెచ్ సీఎల్ నిలిచింది. పదో స్థానంలో ఎయిర్ టెల్ నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గత ఏడాది పదిహేనో స్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ ఏకంగా ఎనిమిదో స్థానానికి ఎగబాకగా.. ఎనిమిదో స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ మాత్రం పదో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా మాయదారి రోగం మనుషుల్నేకాదు.. బ్రాండ్ ఇమేజ్ ను సైతం భారీగా దెబ్బేసిందని చెప్పాలి.