బెంగాల్లో మారణ హోమం మొదలు..

Tue May 04 2021 09:00:31 GMT+0530 (IST)

Targetting starts in West Bengal

మన దగ్గర సార్వత్రిక ఎన్నికలు అంటే.. ఒక్క రోజులో అవగొట్టేస్తారు. అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలకు ఒకేసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఇటీవల బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏకంగా ఎనిమిది విడతల్లో నిర్వహించాల్సి వచ్చింది. దీన్ని బట్టి అక్కడ శాంతి భద్రతల పరిస్థితేంటో అంచనా వేయొచ్చు.వేళ్లూనుకుపోయిన నక్సలిజం సమస్యకు తోడు.. రాజకీయ పరమైన హింస పెచ్చుమీరడంతో అక్కడ ఎన్నికల నిర్వహణ ఆషామాషీ విషయం కాదు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక గెలిచిన వాళ్లు.. ఓడిన పార్టీ వాళ్లపై తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడటం హత్యా రాజకీయాలు చేయడం అక్కడ కామన్. అందులోనూ గత కొన్నేళ్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా దూకుడుతో వ్యవహరించడం.. ఎదురే లేదనుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కేంద్రం అండతో దీటుగా బదులివ్వడంతో.. ఈసారి ఎన్నికల్లోనూ టీఎంసీ గెలిస్తే ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల ఊచకోత తప్పదని అంచనా వేశారు.

సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటలకే బెంగాల్‌లో మారణ హోమం మొదలైనట్లు ఉంది. ఒక్క రోజు వ్యవధిలో ఆరుగురు భాజపా కార్యకర్తలు హత్యకు గురైనట్లు ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి. వాళ్ల ఇళ్లు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాబోయే కొన్ని రోజుల్లో పదుల సంఖ్యలో బీజేపీ కార్యకర్తల హత్యలు జరగడం లాంఛనమే అని.. తమ పార్టీ గెలిస్తే ఎవరెవరిని టార్గెట్ చేయాలో లిస్ట్ వేసుకుని మరీ టీఎంసీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కేంద్రంలో బీజేపీ ... బెంగాల్‌లో అధికార పార్టీ నాయకుల్ని ఏమీ చేయలేని పరిస్థితి అని.. మున్ముందు బీజేపీ కార్యకర్తలు దయనీయ పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని ముందే తేల్చి చెప్పేస్తున్నారు. బీజేపీ గెలిచినా హత్యా రాజకీయాలు ఉండేవని.. కానీ టీఎంసీ గెలుపుతో మాత్రం దారుణమైన పరిణామాలు చూడబోతున్నామని అక్కడి విశ్లేషకులు పేర్కొంటున్నారు.