టార్గెట్ చైనా.. జీ7 తీర్మానాలివే

Mon Jun 14 2021 12:00:38 GMT+0530 (IST)

Target China .. G7 resolutions

మూడు రోజులపాటు ఇంగ్లండ్ లో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సమావేశంలో జీ7 దేశాలుగా ఉన్న అమెరికా బ్రిటన్ జర్మనీ జపాన్ ఫ్రాన్స్ కెనడా ఇటలీతోపాటు అతిథి దేశాలుగా ఇండియా ఆస్ట్రేలియా సౌతాఫ్రికా సౌత్ కొరియా పాల్గొన్నాయి. మొత్తం 6 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. అయితే.. ప్రధానంగా చైనాపైనే జీ7 దేశాలు మాటల దాడిచేశాయి.చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని ఆరోపించాయి. అయితే.. చైనా ప్రపంచానికి వైరస్ ఇస్తే.. మనం వ్యాక్సిన్ ఇద్దామని అన్నాయి. పేద దేశాలకు మొత్తం 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని తీర్మానించాయి. ఇందులో అమెరికా వాటా 50 కోట్ల డోసులు కాగా.. బ్రిటన్ 10 కోట్ల డోసులు ఇస్తామని ప్రకటించాయి. మిగిలినవి ఇతర దేశాలు అందించనున్నాయి.

ఇక చైనా సామ్రాజ్య కాంక్షతో ముందుకు సాగుతోందని ఇందులో పారదర్శకత లేదని దుయ్యబట్టాయి. పేద దేశాలపై పెత్తనం చెలాయించడానికి చైనా ప్రయత్నిస్తోందని అన్నాయి. స్వయం ప్రతిపత్తిగల హాంకాంగ్ పై చైనా ఆధిపత్యాన్ని కూడా నిలదీస్తామన్నాయి. చైనాతో ఆర్థికంగా పోరాటం సాగించాలని ఇతర దేశాలకు పిలుపునిచ్చాయి.

రాబోయే రోజుల్లో వైరస్ ల గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రపంచంలో ప్రతీ చిన్నారి చదువుకునేందుకు సహకరించాలని తీర్మానించాయి. ఇందుకోసం నిధులు సేకరించేందుకు పంచ వర్ష ప్రణాళికను ప్రకటించాయి. ప్రపంచ కర్బన ఉద్గారాలలో 20 శాతంగా ఉన్న జీ7 దేశాల వాటాను వీలైనంత తగ్గించాలని నిర్ణయించాయి.

ప్రధానంగా.. ఈ సమావేశం ఆరు తీర్మానాలను ఆమోదించింది. అందులో ఒకటి కరోనాను అంతం చేయడం రెండు కొవిడ్ వల్ల ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం మూడు భవిష్యత్ తరాల కోసం పలు కార్యక్రమాలు నాలుగు నమ్మకమైన వాణిజ్య సంస్కరణలు ఐదు హరిత విప్లవంతో భూమిని సంరక్షించడం ఆరు పర్యావరణ మార్పులను అడ్డుకోవడంలో ప్రపంచ భాగస్వామ్యం పెంచండం.

ఈ సమావేశంలో అతిథి దేశంగా పాల్గొన్న భారత్ తరపున ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. జీ7 సమ్మిట్ లో భారత్ తటస్థ మిత్రపక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇండియా ప్రజాస్వామ్య దేశమని స్వేచ్ఛ స్వాతంత్రాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. సామ్రాజ్యవాదం ఉగ్రవాదం తీవ్రవాదాలకు భారత్ వ్యతిరేకం అని స్పష్టం చేశారు. అదేవిధంగా.. కొవిడ్ వ్యాక్సిన్ పై మేథోహక్కులు తొలగించాలని అన్నారు.