Begin typing your search above and press return to search.

సొంత సామాజికవర్గం అండ కోసం తమ్మినేని ఆరాటం

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:29 AM GMT
సొంత సామాజికవర్గం అండ కోసం తమ్మినేని ఆరాటం
X
ఉత్తరాంధ్రాలో కాళింగ సామాజికవర్గం చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో లక్షల్లోనే జనాభా ఉంది. అక్కడ రెండు మూడు సీట్లలో గెలిచే స్థాయిలో ఉన్నారు. ఆ తరువాత విశాఖలో నార్త్ వంటి చోట బాగా ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కాళింగులు తమ రాజకీయ వాటా తేల్చమని కోరుతున్నారు.

అయితే కాళింగులకు ప్రత్యేకంగా కార్పోరేషన్ని ఇచ్చి డైరెక్టర్ పోస్టులను ఇచ్చిన జగన్ 2019 ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు తో పాటు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అయితే తమ్మినేని సీతారాం మాత్రమే గెలిచారు. ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీను, ఇక టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పేడాడ తిలక్ ఓడారు.

ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో సొంత సామాజికవర్గంలో బలం పెంచుకునేందుకు స్పీకర్ చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన తాజాగా విశాఖలో జరిగిన కాళింగుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎవరు తమ కులానికి ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తారో వారికే కాళింగులు మద్దతుగా ఉంటారని తమ్మినేని కామెంట్స్ చేశారు.

ఇక తెలుగుదేశం కంటే కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈసారి విశాఖ నార్త్ సీటు కూడా కోరుతామని ఆయన చెబుతున్నారు. ఇక శ్రీకాకుళం ఎంపీ సీటు ఎటూ కాళింగులకే ఇస్తారని, మరో రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా తమ సామాజిక వర్గానికి ఖాయమని ఆయన చెబుతున్నారు.

కాళింగుల మద్దతు కావాలంటే అన్ని రాజకీయ పక్షాలు తమకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని కాళింగ సంఘం నాయకులు కోరారు. అదే విధంగా మూడు జిల్లాలలో కూడా తమకు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా వచ్చేలా చూడాలని వారు అంటున్నారు. మరో వైపు తెలంగాణా ప్రభుత్వం తమకు ఇచ్చే బీసీ డీ రిజర్వేషన్లు రద్దు చేసిందని, దాని మీద ఏపీ ప్రభుత్వం తరఫున పోరాటం చేయాలని కూడా విన్నవించారు.

ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లఒ ఆముదాలవలస టికెట్ తమ్మినేని సీతారాం కి డౌట్ అని అంటున్నారు. ఆయన గ్రాఫ్ అక్కడ పెద్దగా లేదని అంటున్నారు. దాంతో ఆయన కుమారుడిని ముందు పెట్టినా నో అనే పరిస్థితి ఉంది. దాంతో తమ్మినేని ఇపుడు సామాజికవర్గం దన్నుతో అధినాయకత్వం నుంచి టికెట్ పొందాలని చూస్తున్నారా అన్న చర్చ అయితే వస్తోంది.

తమ్మినేని సీతారాం ఈసారి పోటీ చేసి ఎలాగాఇన పార్టీ గెలిస్తే మంత్రి కావాలని చూస్తున్నారు. అదే టైం లో తన రాజకీయ వారసుడిగా కుమారిడిని దింపాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన కాళింగ ఆత్మీయ సదస్సులో కీలకంగా వ్యవహరించారు అని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ కూన రవికుమార్ ఉన్నారు. ఆయన తమ్మినేని మేనల్లుడే. మరోసారి ఆయన ఆముదాలవలస నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు.

కాలీంగులకు నిఖార్సుగా మేలు చేసిన పార్టీ టీడీపీయే అని ఆయన అంటున్నారు. ఏ సామాజికవర్గం అయినా మొత్తం ప్రజల ప్రయోజనాలను నెరవెరచే ప్రభుత్వం పార్టీ ఏదో చూసుకుంటుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఎన్నికల వేళ కుల సమీకరణలతో ముందుకు అడుగువేస్తున్న తమ్మినేనికి అధినాయకత్వం నుంచి ఎంతమేర భరోసా ఉంటుందో చూడాలి. ఈసారి తన రాజకీయ జీవితానికి చిట్ట చివరి ఎన్నికలు అని భావిస్తున్న తమ్మినేని ఇపుడు సామాజికవర్గం ఆసరాతో జాతకం మార్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.