Begin typing your search above and press return to search.

మామకు ఎదురైన అనుభవమే ఆ టీడీపీ ఎమ్మెల్యేకు ఎదురుకానుందా..?

By:  Tupaki Desk   |   20 April 2019 4:02 AM GMT
మామకు ఎదురైన అనుభవమే ఆ టీడీపీ ఎమ్మెల్యేకు ఎదురుకానుందా..?
X
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ - టీడీపీ అభ్యర్థులు వరుసకు మామాఅల్లుళ్లు. ఇందులో మామ తమ్మినేని శ్రీనివాసరావు గత మూడు ఎన్నికలుగా ఓటమి చవిచూస్తుంటే.. మేనల్లుడు కూన రవికుమార్ 2014 ఎన్నికల్లో మామను ఓడించి చంద్రబాబు ప్రభుత్వంలో విప్ పదవి దక్కించుకున్నారు. అయితే.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి విప్ అయిన తమ్మినేని కూడా విప్‌ గా పనిచేసిన తరువాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూన రవికుమార్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కోబోతున్నారని టాక్.

2014లో మామ తమ్మినేని సీతారాంపై పోటీ చేసిన కూన రవికుమార్ చంద్రబాబు ప్రభుత్వంలో విప్‌ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురవనుందన్నది ఆ జిల్లాలో వినిపిస్తున్న మాట. ఇందుకు అక్కడి నేతలు లాజిక్ కూడా చెబుతున్నారు. తమ్మినేని కూడా గతంలో ప్రభుత్వ విప్‌ గా పనిచేసిన తరువాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని.. ఇప్పుడు కూనకు కూడా అలాంటి పరిస్థితే రానుందంటున్నారు.

తమ్మినేని 1985 ఎన్నికల్లో విజయం సాధించి ఎన్టీఆర్ ప్రభుత్వంలో విప్‌ గా పనిచేశారు. అయితే, ఆ తరువాత ఎన్నికలు 1989లో మాత్రం ఆయన ఓడిపోయారు. తమ్మినేని ఆముదాలవలస నియోజకవర్గం నుంచి 1983 - 85ల్లో గెలిచారు. ఆ తరువాత 1989లో ఓడిపోయారు. మళ్లీ 1994 - 99లో గెలిచారు. 2004లో టీడీపీ - 2009లో ప్రజారాజ్యం - 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి వరుసగా మూడు ఎన్నికల్లో తమ్మినేని ఓటమి పాలయ్యారు.

నిజానికి తమ్మినేని - కూనలు అత్యంత సమీప బంధువులు. తమ్మినేని సోదరి కుమారుడే కూన రవికుమార్. అలాగే కూన రవికుమార్ సోదరి వాణినే తమ్మినేని పెళ్లాడారు. మామ కమ్ బావ అయిన తమ్మినేని వెంటే ఒకప్పుడు తిరిగి రాజకీయం నేర్చుకున్న కూన రవికుమార్ ఆ తరువాత ఆయనపైనే పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరూ ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. మరి తమ్మినేనికి ఎదురైన సెంటిమేంటే కూనకు కూడా ఎదురై ఓటమి పాలవుతారు.. లేదంటే వరుసగా రెండేసి ఎన్నికల్లో విజయం సాధించిన తమ్మినేని రికార్డును కూన సమం చేస్తారా అన్నది చూడాలి.