Begin typing your search above and press return to search.

నా అధికారాల్ని ప్రశ్నించడానికి నువ్వెవరు..బాబు పై నిప్పులు చెరిగిన స్పీకర్!

By:  Tupaki Desk   |   20 Jan 2020 12:03 PM GMT
నా అధికారాల్ని ప్రశ్నించడానికి నువ్వెవరు..బాబు పై నిప్పులు చెరిగిన స్పీకర్!
X
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి తరలింపు ఖాయమైన నేపథ్యంలో సీఆర్‌ డీఏ రద్దు - అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఈ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే స్పీకర్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనితో సభ కాసేపు గందరగోళంగా మారింది. అసలేం జరిగిందంటే.. వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున భూఅక్రమాలకు పాల్పడ్డారని - ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోళ్ల వ్యవహారం నడిచిందని లెక్కలతో సహా వివరించారు.

దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. దీనితో స్పీకర్ మాట్లాడుతూ రెండు వైపుల వాళ్లు భిన్నవాదనలు వినిపించారు కాబట్టి.. నిజానిజాలు బయటపడేలా ఇన్ సైడర్ ట్రేడింగ్ - భూముల అక్రమాలపై సభాపరమైన విచారణకు ఆదేశిస్తున్నానని ప్రకటించారు. స్పీకర్‌ ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగలడంతో ఆగ్రహించిన స్పీకర్‌.. 'సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అక్రమాలపై సభలో చర్చ జరుగుతున్నందున దానిపై జోక్యం చేసుకునే అధికారం తనకుందన్న స్పీకర్... ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలంటూ సీఎం జగన్ కు సూచించారు.

ఇంతలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. విచారణకు ఆదేశించే అధికారం మీకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించడంతో స్పీకర్ ఒక్కసారిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. డోంట్ టాక్ రబ్బిష్.. ఒక స్పీకర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారాలు నాకున్నాయి. సభాపతి అధికారాల్ని ప్రశ్నించడానికి నువ్వెవరు? లిమిట్స్ లో ఉండటం నేర్చుకోండి అని హితవు పలికారు. ఆ తరువాత దీనిపై మాట్లాడిన మంత్రి బొత్స స్పీకర్ పదవినే కించపర్చేలా కామెంట్లు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మొదటి నుంచి స్పీకర్ అన్నా - అసెంబ్లీ అన్నా గౌరవం లేదని - మాటకొస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఈ రోజు సభాపతినే దూషించే స్థాయికి దిగజారడం అవమానకరమని - 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో చంద్రబాబుకు కొంచెమైనా బుద్ధి నేర్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.