Begin typing your search above and press return to search.

బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ...!

By:  Tupaki Desk   |   29 May 2020 12:10 PM GMT
బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ...!
X
సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ద్వారా సినీ పరిశ్రమలోని రోజువారీ వేతన కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఛారిటీ ద్వారా చేయాల్సిన పనులు.. భవిష్యత్ ప్రణాళిక విషయమై మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కరోనా క్రైసిస్ చారిటీ సమావేశం జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్, చిరంజీవి, సి. కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వచ్చే నెలలో కూడా సినీ కార్మికులకు సహాయం చేయాలని.. అలానే మొదటి విడత సాయం అందని వారికి రెండో విడతలో సాయం అందజేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. ఇది సీసీసీ మీటింగ్ అని బాలయ్య వ్యాఖ్య పై డిస్కస్ చేయలేదని చెప్పుకొచ్చాడు.

బాలయ్యని సమావేశాలకు పిలవకపోవడం పై తమ్మారెడ్డి స్పందిస్తూ అవసరం ఉన్నవాళ్లని పిలిచి ఉంటారని.. నన్ను కూడా నిన్న సీఎంతో జరిగిన మీటింగ్ కి పిలవలేదని.. బాలకృష్ణతో అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు కూడా వెళతారని.. దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు.. బాలకృష్ణ వ్యాఖ్యల పై నాగబాబు స్పందన వారి వ్యక్తిగతమని తమ్మారెడ్డి చెప్పారు. ఈ సమావేశాలకు మహేష్ బాబు వెంకటేష్ రాజశేఖర్ లాంటి వారిని కూడా పిలవలేదని.. అవసరమనుకుంటే అందరిని పిలుస్తారని.. బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఉంటుందని ఎలా అనుకుంటున్నారు.. షూటింగ్స్ ఓపెనింగ్ చేసుకోవడానికి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ సమావేశం అయ్యారే కానీ వేరే విధంగా కాదని.. సీఎంతో మీటింగ్ కి కూడా అంతమంది వెళ్లకుండా ఒకరో ఇద్దరో వెళ్లి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా బాలకృష్ణ ఎందుకు రియల్ ఎస్టేట్ మాట అన్నారో తెలియదని.. ఇండస్ట్రీలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు ఉన్నారని.. అది తప్పేమీ కాదని.. 'మా' మీటింగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి డిస్కస్ చేశారనడం అవాస్తవమని.. బాలయ్య కూడా ఆ ఉద్దేశ్యంతో అని ఉండడని చెప్పుకొచ్చారు. ఈ సమావేశాలన్నీ కేవలం పరిశ్రమ కోసమేనని.. అవసరాన్ని బట్టి మీటింగ్ కు కొందరిని పిలిచారని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమావేశం కాబట్టి లీడ్ తీసుకోమని కొందరి పేర్లను వారే సూచించి ఉండొచ్చని.. జరిగిన దాంట్లో ఎలాంటి వివాదం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేసారు.