Begin typing your search above and press return to search.

ఆ హెర్బల్ మైసూర్ పాక్.. మహమ్మారికి మస్తు మందట

By:  Tupaki Desk   |   8 July 2020 11:30 PM GMT
ఆ హెర్బల్ మైసూర్ పాక్.. మహమ్మారికి మస్తు మందట
X
యావత్ ప్రపంచం.. తోపుల్లాంటి సైంటిస్టులు కంటికి కనిపించని మహమ్మారికి చెక్ చెప్పేందుకు వందలాది కోట్లు పరిశోధనలకు ఖర్చు పెడుతూ.. వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటే.. అందుకు భిన్నంగా సాగుతున్నకొన్ని ప్రచారాల్ని చూస్తే.. నవ్వు రాక మానదు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఒక స్వీటు షాపు యజమాని తాము తయారు చేసిన హెర్బల్ మైసూర్ పాక్ తో మాయదారిరోగానికి చెక్ చెప్పొచ్చని చేస్తున్న ప్రచారం సంచలనంగా మారింది.

ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లు.. హెర్బల్ మైసూర్ పాక్ కాన్సెప్టును తెర మీదకు తెచ్చిన ఈ మిఠాయి దుకాణం తమిళనాడులోని కోయంబత్తూరు చిన్నియం పాళయంలో ఉంది. రోజుకు ఒకటి చొప్పున హెర్బల్ మైసూర్ పాక్ తింటే.. మహమ్మారి బారి నుంచి సురక్షితంగా బయటపడొచ్చని చెబుతున్నారు. ఇలాంటివి ఎంత త్వరగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.దీనికి తోడు.. సదరు మిఠాయి దుకాణ యజమాని.. తాము తయారు చేసిన హెర్బల్ మైసూర్ పాక్ ను రోగ లక్షనాలు ఉన్న వారంతా ఉచితంగా తీసుకెళ్లొచ్చన్న ఆఫర్ ఇవ్వటంతో.. దీని డిమాండ్ మరింత పెరిగింది.

అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం కోరాలే కానీ తమ హెర్బల్ మైసూర్ పాక్ ఫార్ములాను ఇస్తామని చెప్పటంతో దీని ప్రచారం మరింత పెరిగింది. రోజురోజుకి పెరుగుతున్న ఈ ప్రచారంపై అధికారులు కన్నేశారు. ఊళ్లను.. ఊళ్లకు పాకుతున్న ఈ హెర్బల్ మైపూర్ పాక్ లెక్క తేల్చేందుకు అధికారంలు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.

హెర్బల్ మైసూర్ పాక్ వ్యవహారం తమ వరకు వచ్చిందని.. ఇదంతా ప్రజల్ని తప్పుదోవ పట్టించటానికేనని.. దీనిపై సమగ్ర విచారణను చేపట్టినట్లుగా తమిళనాడు ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వెల్లడించారు. అధికారుల మాటలు ఇలా ఉంటే.. ప్రజలు మాత్రం .. ఏ పుట్టలో ఏ పాము ఉందో..?ఎందుకు వదిలిపెట్టటం అంటూ భారీగా ఈ హెర్బల్ మైపూర్ పాక్ ను కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు.