'కరుణ' విషాధం.. మందుబాబుల హాహాకారం..

Fri Aug 10 2018 13:04:33 GMT+0530 (IST)


కరుణానిధి మరణంతో తమిళనాట అంతా విషాధ చాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా అదే మౌనం.. ఏ టీవీ ఆన్ చేసినా అవే వార్తలు.. శోకసంద్రంలో తమిళ ప్రజలు ఉంటే మందు బాబులు మాత్రం ఉగ్గపట్టుకోలేకపోయారు..కరుణానిధి మంగళవారం సాయంత్ర తనువు చాలించారు. ఆయన మరణానికి గుర్తుగా సంతాప దినాలు ప్రకటించి మొత్తం అన్ని షాపులు - విద్యాలయాలు - వివిధ సంస్థలు మూసివేశారు. ఇందులో మద్యం షాపులు - బార్లు కూడా ఉన్నాయి. దీంతో ఆ రెండు రోజులు తమిళనాట మద్యం బంద్ అయ్యింది. చుక్క పడనిదే  ఉండలేని మందు బాబులు ఈ ఎడబాటును తట్టుకోలేకపోయారు.. బస్సు - రైలు.. ఏదీ అందుబాటులో ఉంటే అది ఎక్కేసి నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో వాలిపోయారు. అక్కడ వైన్ షాపుల ఎదుట భారీ క్యూలు కట్టారు.

నెల్లూరు జిల్లాలోని తడ - సూళ్లూరుపేట మార్గంలో తిరిగే వాహనాలన్నీ ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి.  వైన్ - బార్ షాపులన్నీ తమిళ తంబీలతో నిండిపోయాయి. ఎందుకింత జనం అని ఆరాతీసిన జనాలకు విషయం బయటపడింది. కరుణానిధి మరణంతో మద్యం షాపులు మూసివేయడంతో ఇలా నెల్లూరు జిల్లాకు వచ్చి మరీ మందు బాబులు తమ జిహ్వచాపల్యాన్ని సంతృప్తి పరుచుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూడడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.