Begin typing your search above and press return to search.

'జ‌గ‌న‌న్న కాల‌నీ' గూగుల్ మ్యాప్‌లో క‌నిపించ‌డం లేదా?

By:  Tupaki Desk   |   26 July 2021 10:30 AM GMT
జ‌గ‌న‌న్న కాల‌నీ గూగుల్ మ్యాప్‌లో క‌నిపించ‌డం లేదా?
X
జ‌గ‌న‌న్న కాల‌నీ!... ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సంక్షేమ ప‌థ‌కం. అర్హులైన‌, ఆవాసం లేని పేద‌ల‌కు ప‌క్కా ఇల్లు ఇవ్వాల‌నే సంక‌ల్పంతో సీఎం జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతోనే దీనిపై పెద్ద ఎత్తున దృష్టిపెట్టారు. ఆదిలో 25 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ఇళ్లు మంజూరు చేయాల‌ని అనుకు న్నారు. అయితే.. అనేక అధ్య‌య‌నాలు, వ‌డ‌పోత‌ల త‌ర్వాత‌.. ఈ సంఖ్య 30 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. అయితే .. వీటిలో 27 లక్ష‌ల మందికి ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థ‌లాలు కేటాయించారు.

ప‌ట్ట‌ణాల్లో ఉండే అర్హులైన పేద‌ల‌కు.. సెంటు చొప్పున‌.. ప‌ల్లెల్లో ఉండే అర్హులైన పేద‌ల‌కు సెంటున్న‌ర చొప్పున ఈ స్థ‌లాల‌ను కేటాయించారు. ఈ స్థ‌లాల సేక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం బాగానే వ్య‌యం చేసింది. ఒకానొ క సంద‌ర్భంలో స్థ‌లాలు ల‌భించ‌ని ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. ఇక‌, ఈ స్థ‌లాలను ప్ర‌భుత్వం కొనుగోలు చేసే స‌మ‌యంలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. అధికార పార్టీ నేత‌లు.. త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఎందుకూ ప‌నికి రాని భూముల‌ను, చెరువుల‌ను కూడా ప్ర‌భుత్వానికి అంట‌గ‌ట్టార‌ని.. కొన్నాళ్ల కింద‌ట పెద్ద ఎత్తున విమ‌ర్శ లు కూడా వ‌చ్చాయి.

ఇక‌, ఈ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల సంగ‌తి ఇలా ఉంచితే.. మొత్తానికి 2020 ఉగాది స‌మ‌యానికే ఇళ్లు కేటా యించాల‌ని అనుకున్నా.. క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డుతూ.. ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌రులో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను పంచారు. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. వీటి నిర్మాణం విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భుత్వమే నిర్మించి ఇస్తాన‌ని ముందు ప్ర‌క‌టించింది. కానీ, బ‌డ్జెట్ భారీగా పెరిగిపోవ‌డంతో.. మీరే నిర్మించుకోండి.. మేం కొంత రాయితీ ఇస్తాం.. అని ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే కేంద్రం చేప‌ట్టిన ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద నిధులు రాబ‌ట్టుకునేందుకు కూడా ప్ర‌యత్నించింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి స‌మాచారం రాష్ట్రానికి అంద‌లేదు. మ‌రోవైపు.. వీటిని నిర్మించ‌డం ద్వారా రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెక్ పెట్టాల‌నుకున్న జ‌గ‌న్‌.. వ్యూ హాత్మ‌కంగా ఇటీవ‌ల‌.. అంద‌రితోనూ సామూహిక‌.. శంకుస్థాప‌న‌లు చేయించారు. ఇది కూడా ఓకే. అయితే.. ఇటీవల రాష్ట్ర మంతా కురిసిన వ‌ర్షాల‌తో ఈ జ‌గ‌న‌న్న కాల‌నీల్లోని ఇళ్లు చెరువుల‌ను త‌ల‌పించాయి. మోకాల్లోతు నీటిలో మునిగిపోయాయి. దీంతో ప‌ట్ట‌ణాల్లో ఉన్న పేద‌లు.. వారి బంధువులు.. ఇప్పుడు త‌మ స్థ‌లాల‌ను గుర్తు ప‌ట్ట‌డం కూడా గ‌గ‌న‌మైంద‌నే వాద‌న చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. జ‌గ‌నన్న కాల‌నీల‌కు సంబంధించిన లేఅవుట్‌ను గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేయ‌గా.. అవి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అందరూ హ‌తాశుల‌య్యారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం వివరాలు.. గూగుల్‌లో కూడా క‌నిపించ‌క పోవడం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. దీనికి రీజ‌నేంటి? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. జ‌గ‌న‌న్న కాల నీల‌కు కేటాయించిన స్థ‌లాలు.. ఊరికి దూరంగా ఉండ‌డం.. ప‌ట్ట‌ణాల్లోనూ ప‌ల్లెల్లోనూ.. పొలాల‌ను త‌ల‌పించేలా ఉన్న స్థ‌లాల‌ను కేటాయించ‌డం.. కొన్ని చోట్ల కొండ‌ల ప‌క్క‌న కూడా కేటాయించ‌డంతో గూగుల్‌లో వాటిని చేర్చ‌లేద‌ని అంటున్నారు.

అయితే.. ఇంత సుదూర ప్రాంత‌ల్లో కేటాయించిన ఇళ్ల స్థ‌లాల‌ను ముందు తీసుకున్నా.. త‌ర్వాత వాటి ప‌రిస్థితిని తెలుసుకున్న ల‌బ్ధి దారులు.. ఇప్పుడు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల కృష్ణాజిల్లా, ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి, క‌ర్నూలు జిల్లాల్లోల‌బ్ధిదారులైన మ‌హిళ‌లు ఈ స్థ‌లాలు మాకొద్దు.. అంటూ.. అధికారుల‌కు స‌ద‌రు స్థ‌లాల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను తిరిగి ఇచ్చేయ‌డం గ‌మ‌నార్హం. అంటే.. మొత్తంగా చూస్తే.. ఎందుకూ ప‌నికిరాని స్థ‌లాల‌ను కేటాయించార‌ని.. న‌గ‌రానికి ప‌ల్లెల‌కు ఇంత సుదూరంగా ఉంటే..తమ ఉపాధి మాటేమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!