Begin typing your search above and press return to search.

ఒకప్పటి గురువును ఇంత కసిగా తిడితే ఎలా తలసాని?

By:  Tupaki Desk   |   14 April 2019 5:24 AM GMT
ఒకప్పటి గురువును ఇంత కసిగా తిడితే ఎలా తలసాని?
X
ఎవరైనా కానివ్వండి.. తమకు ఒకప్పటి గురువు.. సీనియర్ కనిపిస్తే.. తామెంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికి కాస్త తగ్గి మాట్లాడటం కనిపిస్తుంది. ఇది వారి మీద ఉన్న అభిమానానికి నిదర్శనమన్నట్లుగా వారు వ్యవహరిస్తుంటారు. ఇందుకు పూర్తి మినహాయింపుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గా చెప్పాలి. సుదీర్ఘ కాలం టీడీపీ నేతగా.. చంద్రబాబుకు అండగా నిలిచిన ఆయన.. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే.

బాబు మీద ఘాటు విమర్శలు చేయాలన్న ప్రతిసారీ రంగంలోకి దిగే తలసాని.. తాజాగా మరోసారి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ.. ఏపీ ప్రజల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తులు అమ్ముకొని తెలంగాణను విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్లిపోవాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఇంత తీవ్రస్థాయిలో ఇప్పటివరకూ మరే నేత బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించలేదేన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐదేళ్లుగా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న ఏపీ.. తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని బాబు ప్రయత్నిస్తున్నారని.. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులపై దాడులు చేస్తున్నారని.. నోటీసులు ఇస్తున్నారని.. బెదిరింపులకుపాల్పడుతున్నారంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని బాబుపై ఫైర్ అయ్యారు.

తెలంగాణపై నమ్మకం లేకుంటే హైదరాబాద్‌ లోని తన ఆస్తుల్ని అమ్ముకొని పోవాలన్న తలసాని.. బాబుకు నిజాయతీ, ఏపీ ప్రజలపై ప్రేమ ఉంటే గెలిచినా.. ఓడినా అమరావతిలోనే ఉండాలన్నారు. బాబుతోనే రాజకీయాల్లో డబ్బు సంస్కృతి ప్రారంభమైందని.. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బాబును ఉద్దేశించి తలసాని ఇంకేమన్నారంటే..

% చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన నిజాయతీపరుడే అయితే పిల్లల్ని తీసుకొని కాణిపాకం వినాయకుడి గుడిలో ఒట్టు వేయాలి. నేను కూడా మా పిల్లల్ని తీసుకొచ్చి ఒట్టు వేస్తా.

% చంద్రబాబు చేసేదంతా అవినీతే. పాలు - కూరగాయలు అమ్మే హెరిటేజ్‌ ద్వారా రూ.1600 కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి. ఏళ్లు కూడా నిండని తన మనవడి పేరు మీద రూ.85 కోట్లు ఎలా వచ్చాయి?

% బాబు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ రోజు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రచారం ముగిసినప్పటికీ టీవీల్లో - పేపర్లలో పబ్లిసిటీ కోసమే ఎన్నికల అధికారిని కలిసి డ్రామా చేశారు.

% ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ కన్నా ఎక్కువగా కేసీఆర్‌ పేరునే ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలు మంచివే అయినప్పుడు.. వాటిపై ఇప్పుడెందుకు అనుమానం?

% టెక్నాలజీని తానే పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడడం హాస్యాస్పదం. ఏపీలో 46 వేల ఈవీఎంలు ఉండగా కేవలం 300 మాత్రమే మొరాయించాయి చంద్రబాబు మాటలు వింటుంటే ఆయన కంటే కేఏ పాల్‌ చాలా బెటరని అనిపిస్తోంది.

% జాతీయ పార్టీ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉన్నాడో చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడడంతోనే పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ గుర్తొచ్చాయా? విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను 5 ఏళ్లలో పూర్తి చేయడం చేతకాని చంద్రబాబు హైదరాబాద్‌ను నిర్మించాడా?

% నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ టికెట్లు ఇవ్వడం చేతకాని దద్దమ్మ చంద్రబాబు. ఓటమికి చంద్రబాబు సిద్ధమయ్యే ఉన్నారు. ఓటమి తర్వాత ఆయనకు హైదరాబాదే దిక్కు. నేషనల్‌ ఛాంపియన్‌ను అని చెప్పుకునే చంద్రబాబు నేను ఏపీకి వెళ్తే ఎందుకు భయపడ్డారు?