Begin typing your search above and press return to search.

చంపేద్దామనే లెమన్ ట్రీ హోటల్ కు తీసుకెళ్లాడా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 12:30 AM GMT
చంపేద్దామనే లెమన్ ట్రీ హోటల్ కు తీసుకెళ్లాడా?
X
తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన లెమన్ ట్రీ హోటల్ హత్య... ఆత్మహత్య ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోందా? హత్య జరిగి మూడు రోజులు దాటుతున్నా.. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఒక్క అధికార ప్రకటన విడుదల చేయకపోవటం.. ఒక్కో మీడియా రిపోర్టు ఒక్కోలా ఉండటం గమనార్హం. ఏళ్లకు ఏళ్లుగా ప్రేమించుకుంటున్న రాములు.. సంతోషిలు మాదాపూర్ లోని ఖరీదైన లెమన్ ట్రీ హోటల్లో బస చేయటం.. పక్క రోజున రూంను ఖాళీ చేయాల్సిన సమయానికి చేయకపోవటంతో.. అనుమానం వచ్చి తలుపులు తీయగా.. ఇరువురు మరణించటం తెలిసిందే.

ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ప్రేమించుకొని ఇంట్లో వారికి తెలీకుండా పెళ్లి చేసుకున్నట్లుగా మీడియా రిపోర్టులో పేర్కొన్నా.. అదేమీ నిజం కాదంటున్నారు వారి కుటుంబ సభ్యులు.పెళ్లి చేసుకుంటే మాకు తెలీకుండా ఉంటుందా? అని మరణించిన వారి కుటుంబీకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో.. హోటల్ గదిలో మూడో వ్యక్తి ఉన్నారన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు.. ఒక్క బ్లేడ్ తో ఇద్దరు గొంతు కోసి చనిపోయే అవకాశం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు.. ప్రియురాలిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్న ఉదంతంలో.. రాములు స్వరపేటిక తెగిపోవటం పెద్ద ప్రశ్నగా మారింది.

ఒక వ్యక్తి బ్లేడ్ తో గొంతు కోసుకునే క్రమంలో తన స్వరపేటికను సైతం కోసుకునే అవకాశం ఉందా? అన్న మాట వినిపిస్తోంది. వారికి పోస్టుమార్టం నిర్వహించిన వేళ.. వైద్య నిపుణుల నుంచి వస్తున్న సమాచారం కొత్త సందేహాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. లెమన్ ట్రీలాంటి హోటల్ లో ఎవరైనా గదిలోకి వెళ్లాలంటే యాక్సిస్ కార్డు ఉండాలని.. లేదంటే వెళ్లటం కుదరదని చెబుతున్నారు. ఈ క్రమంలో.. మూడో వ్యక్తి వెళ్లే అవకాశం లేదంటున్నారు.

అదే సమయంలో.. వీరిద్దరికి తెలిసిన వ్యక్తి ఎవరైనా వీరే గదిలోకి తీసుకొచ్చి ఉంటే? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లభించటం లేదు. ఒకవేళ అదే జరిగితే.. వారు హోటల్ లో దిగిన తర్వాత నుంచి మరణించినట్లుగా హోటల్ సిబ్బంది గుర్తించినంత వరకు.. రూం దగ్గరగా ఉన్న సీసీ ఫుటేజీలను జాగ్రత్తగా చెక్ చేయాల్సిందేనని చెబుతున్నారు. అప్పుడు మాత్రమే రూంలోకి ఎవరు వెళ్లారు? అన్న ప్రశ్నకు పక్కా సమాధానం లభిస్తుందని చెబుతున్నారు.

జంట మృతుల కేసులో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే.. ఫోరెన్సిక్ రిపోర్టు కీలకమని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో సీసీ కెమేరా ఫుటేజ్.. వారి సెల్ ఫోన్ కాల్ డేటాతో పాటు.. వారి వాట్సాప్ చాట్ ను ఓపెన్ చేయగలిగితే.. ఈ చిక్కుముడులు వీడే వీలుందంటున్నారు. మరోవైపు పోలీసుల వెర్షన్ మాత్రం.. ప్రియురాలిని హత్య చేసి.. తాను ఆత్మహత్య చేసుకోవాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే లెమన్ ట్రీ హోటల్ కు సంతోషిని తీసుకొచ్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వస్తున్న సందేహాలకు కాలం సమాధానం ఇచ్చే వీలుందని చెప్పక తప్పదు.