Begin typing your search above and press return to search.

సీఎం కుమారుడిపై చర్యలు తీసుకొండి .. హైకోర్టు ఆదేశాలు !

By:  Tupaki Desk   |   19 Jun 2021 5:30 AM GMT
సీఎం కుమారుడిపై చర్యలు తీసుకొండి .. హైకోర్టు ఆదేశాలు !
X
ఆంక్షలు సామాన్యుల మాత్రమే తప్ప , అధికారంలో ఉండే వారికి కాదు అని చాలామంది సామాన్యులు ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంటారు. అది కొన్ని కొన్ని సందర్భాల్లో అక్షర సత్యంగా ఉంటుంది. అధికారం చేతిలో వుంటే నిబంధనలని గాలికి వదిలేయడం అన్ని విషయం సహజాతి సహజంగా చేసేస్తుంటారు రాజకీయ నాయకుల వారసులు. తమ తండ్రి ఉన్నత పదవిలో ఉంటె ఇక వారి పుత్ర రత్నాలు ప్రభుత్వ అధికారులు తమ పని మనుషులు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి వీరు చేసే అతి కి కోర్టు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి వస్తుంది.

తాజాగా కర్నాటక లో ఇదే జరిగింది. అధికారులు వద్దని వారించినా లాక్‌ డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయేంద్ర ఆలయంలో పూజలు చేసిన ఘటనపై లెట్‌ కిట్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, న్యాయమూర్తి సూరజ్‌ గోవిందరాజ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నంజనగూడు ఆలయానికి విజయేంద్ర వెళ్లడం నిజమేనని, 5నిమిషాలు మాత్రమే ఆయన ఆలయంలో ఉన్నారని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభులింగ ఈ ఘటనను సమర్థించే ప్రయత్నం చేశారు. దీనిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆలయంలోకి ప్రవేశించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశించడంతో తప్పని పరిస్థితిలో విజయేంద్ర పై చర్యలు చేపట్టడానికి అధికారులు ఉద్యుక్తులయ్యారు.