Begin typing your search above and press return to search.

భాగ్యనగరికి తిరుపతి లడ్డూలు..ఆర్డర్ ఎలా ఇవ్వాలంటే?

By:  Tupaki Desk   |   31 May 2020 6:06 AM GMT
భాగ్యనగరికి తిరుపతి లడ్డూలు..ఆర్డర్ ఎలా ఇవ్వాలంటే?
X
తెలుగువారికి ఆరాధ్యమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి నిత్యం వేలాదిమంది తిరుమల వెళుతుంటారు. లాక్ డౌన్ పుణ్యమా అని.. తిరుమలకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటివేళ.. తిరుమలలో శ్రీవారికి ప్రసాదంగా పెట్టే లడ్డూ ప్రసాదాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించాలని.. తద్వారా స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు చేరేలా చేయాలని టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా లడ్డూ అమ్మకాలు కొద్ది రోజుల క్రితం షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) నుంచి హైదరాబాద్ లోనూ తిరుపతి లడ్డూల్ని అమ్మకాలకు ప్రారంభిస్తున్నారు.

హిమాయత్ నగర్ లోని టీటీడీ కార్యాలయం వద్ద లడ్డూల్ని విక్రయిస్తున్నారు. శనివారం సాయంత్రం 40వేల లడ్డూల లోడ్ తో లారీ వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి స్వామివారి ప్రసాదాన్ని అమ్మనున్నారు. రూ.50 విలువ చేసే లడ్డూను రూ.25 చొప్పున అమ్మనున్నారు. తొలిరోజున పదివేల లడ్డూల్ని విక్రయించనున్నారు.

ఇక.. స్వామివారి లడ్డూను సొంతం చేసుకోవాలనుకునేవారు.. తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించటంతో పాటు.. మాస్కులు ధరించాల్సి ఉంటుంది. లాక్ డౌన్ వేళ తిరుమల వెళ్లలేని వేళ.. స్వామివారి ప్రసాదాన్ని తినే భాగ్యం కలగటంపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. లడ్డూల్ని పెద్ద ఎత్తున కావాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇందుకోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ 9849575952.. ఆలయ పేష్కార్ శ్రీనివాస్ 9701092777 సెల్ కు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు. అంతేకాదు.. టీటీడీ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333 ఫోన్లు చేసి కూడా ఆర్డర్లు ఇవ్వొచ్చు. ఈ రోజు హిమాయత్ నగర్ లోని బాలాజీ భవన్ లో లడ్డూల్ని అమ్ముతున్నా.. రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ లోని టీటీడీ టెంపుల్ లో కూడా అమ్మకాలు షురూ చేస్తారని చెబుతున్నారు. అదెప్పుడన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.