బంగారంపై టీటీడీ తడబాటు!...అసలు గుట్టేమిటి బాసూ?

Mon Apr 22 2019 17:33:40 GMT+0530 (IST)

TTD Blames Punjab National Bank For Lapses In Gold Transportation

సరిగ్గా తమిళనాట ఎన్నికల పోలింగ్ కు ముందు అధికారులకు పట్టుబడ్డ తిరుతల వెంకన్నకు చెందిన బంగారం వెనుక పెద్ద తతంగమే నడిచిందన్న అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ బంగారం టీటీడీకే చెందినప్పటికీ... దీనిపై వివరణ ఇచ్చేందుకు నేటి మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చేసిన హడావిడే ఈ అనుమానాలకు తావిచ్చిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధికారులు పట్టుకున్న బంగారం టీటీడీదేనని చెప్పుకొచ్చిన సింఘాల్... అయితే ఆ బంగారం తమ వద్దకు చేరిన తర్వాతే టీటీడీది అవుతుందని అప్పటిదాకా అది టీటీడీది కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను కలకలమే రేగుతోంది.మొత్తంగా నిన్నటిదాకా ఎన్నికల అధికారులు పట్టుకున్న బంగారం టీటీడీదేనని అయితే ఏదో చిన్న పొరపాటు కారణంగానే ఆ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారని ఇప్పుడు ఆ బంగారం టీటీడీకి చేరిన నేపథ్యంలో ఇక సమస్యేమీ లేదన్న వాదన వినిపించింది. అయితే బంగారం టీటీడీకి చేరిన తర్వాత ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయడం సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు ఆ బాధ్యతలు అప్పగించడం వెనువెంటనే మన్మోహన్ రంగంలోకి దిగడం అప్పటిదాకా కామ్ గానే ఉన్న ఈవో ఉన్నట్టుండి మీడియా ముందుకు రావడం చూస్తుంటే...  ఈ వ్యవహారం వెనుక పెద్ద మతలబే ఉందన్న వాదన రేగింది.

వాస్తవంగా ఈ వ్యవహారంపై జనాల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటే... సీఎస్ విచారణకు ఆదేశాలు జారీ చేయకముందే ఈవో వివరాలు వెల్లడించి ఉంటే సరిపోయేది. అలా కాకుండా సీఎస్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత విచారణాధికారి రంగంలోకి దిగిన తర్వాత హడావిడిగా ఈవో మీడియా ముందుకు రావడం చూస్తుంటే... నిజంగానే ఈ వ్యవహారంలో పెద్ద గూడు పుఠానీనే చోటుచేసుకుని ఉందన్న అనుమానాలను బలం చేకూరుతోంది. అయితే ఈ గుట్టు ఏమిటన్నది జనాలకు తెలియజేస్తారా?  లేదంటే... బంగారం టీటీడీకి చేరిన నేపథ్యంలో నిజాలను సమాధి చేస్తారా? అన్న అనుమానాలు మరింతగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అయినా ఈ వ్యవహారంలో హడావిడిగా మీడియా ముందుకు వచ్చిన ఈవో ఏం చెప్పారన్న విషయానికి వస్తే... స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా తయారు చేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో 2016 ఏప్రిల్ 18న పంజాబ్ నేషనల్ బ్యాంకులో టీటీడీకి చెందిన 1311 కిలో బంగారాన్ని డిపాజిట్ చేశామన్నారు. మూడేళ్ల పరిధికి లోబడి ఈ బంగారాన్ని డిపాజిట్ చేశామన్నారు. 2019 ఏప్రిల్ 18న అంటే.. సరిగ్గా తమిళనాట ఎన్నికల పోలింగ్ జరిగే రోజుతో ఈ గడువు తీరిపోతుందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 18న బ్యాంకు అధికారులు తమకు బంగారాన్ని అప్పగించాల్సి ఉందన్నారు.

ఈ క్రమంలో బ్యాంకు అధికారులు తాము డిపాజిట్ చేసిన 1311 కిలోల బంగారం దానిపై వచ్చిన వడ్డీ 70 కిలోల బంగారం... మొత్తం 1381 కిలో బంగారాన్ని పీఎన్బీ అధికారులు తమకు అప్పగించేందుకు చెన్నై నుంచి బయలుదేరారని చెప్పారు. అయితే తనీఖీల్లో ఈ బంగారాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు పత్రాలను సమర్పించి తిరిగి ఆ బంగారాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని తిరుపతికి వచ్చి తమకు అందజేశారని తెలిపారు. తమకు అందజేసిన తర్వాత మాత్రమే అది టీటీడీకి చెందినదని అంతకుముందు అది తమ బంగారం కాదని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని తరలించే బాధ్యత పూర్తిగా బ్యాంకు అధికారులదేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా బంగారం రవాణాలో చోటుచేసుకున్న పరిణామాలు ఏ ఒక్కదానితో కూడా తమకు సంబంధం లేదన్న విషయాన్ని చెప్పేందుకు ఈవో నానా తంటాలు పడ్డారు.

అంతేకాకుండా ఈ వ్యవహారంలో తమకు ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారని వాటికి సంతృప్తికరమైన సమాధానాలే ఇచ్చామని కూడా వెల్లడించారు. అయితే ఆ నోటీసుల్లో ఐటీ శాఖ ఏఏ అంశాలను ప్రస్తావించిందన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇప్పటికే నెలకొన్న అనుమానాలను మరింతగా పెద్దవి చేసేలా ఈవో వ్యవహరించారని చెప్పక తప్పదు. బంగారం రవాణా తమకు సంబంధించినది కాదని పేర్కొన్న ఈవో... ఆ బంగారం తమదే అయినా... తమ వద్దకు చేరేదాకా అది తమది కాదని పేర్కొనడం ఎన్నికల అధికారులు పట్టుకున్న బంగారం తమది కాదని పేర్కొనడం చూస్తుంటే... ఈ వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టుగా కనిపిస్తోంది. మరి సీఎస్ ఆదేశించిన విచారణతో ఈ గుట్టు బయటపడుతుందా?  లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.