మిలియన్ మార్చ్ ...ముందస్తు అరెస్టులు.. ఏంజరగబోతుంది ?

Fri Nov 08 2019 17:09:50 GMT+0530 (IST)

TSRTC JAC Million March In Tank Bund

తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్ ని పరిష్కరించాలని సమ్మె కి దిగి నేటికీ 35 రోజులు కావొస్తుంది. కానీ ఈ సమ్మె కి ముగింపు మాత్రం కనబడటం లేదు. సమ్మె పై అటు ప్రభుత్వం ..ఇటు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో సమ్మె అలాగే కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలు అలాగే ఇబ్బందులు పడుతూనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకూ.. సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ కి విపక్షాలు మద్దతు తెలిపాయి.  కానీ సి ఎం కేసీఆర్ ఎట్టి  పరిస్థితుల్లోనూ.. ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేసేది కుదరదని చెప్పారుదీనితో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.. అశ్వత్థామ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా.. ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్టు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ రేపటి ఛలో ట్యాంక్‌బండ్‌ను.. మరో మిలియన్ మార్చ్‌గా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అఖిలపక్షం నేతలు మద్దతు పలికారు. కార్మికులు కుటుంబ సభ్యులతోపాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు విద్యార్థులు ప్రజాసంఘాలను పెద్ద ఎత్తున ఛలో ట్యాంక్‌బ్యాండ్‌కు తరలించేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనేలా ఆర్టీసీ జేఏసీ నేతలు వారితో చర్చలు జరుపుతున్నారు.

‘ఛలో ట్యాంక్ బండ్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇచ్చేది లేదని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నేతలు మగ్దూం భవన్‌లో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఛలో ట్యాంక్ బండ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.