Begin typing your search above and press return to search.

మోడీ దిగిరావాలి.. పార్ల‌మెంటులో మ‌న గ‌ళం గ‌ద్దించాలి: కేసీఆర్ దిశానిర్దేశం

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:00 AM GMT
మోడీ దిగిరావాలి.. పార్ల‌మెంటులో మ‌న గ‌ళం గ‌ద్దించాలి:  కేసీఆర్ దిశానిర్దేశం
X
మ‌రో 24 గంట‌ల్లో పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటులో అనుస‌రించాల్సిన విధి విధానాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. బీఆర్ ఎస్ పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. పార్ల‌మెంటులో తెలంగాణ గ‌ళం వినిపించాల‌ని ఆయ‌న నిర్దేశించారు. మోడీ దిగి వ‌చ్చేలా.. తెలంగాణ‌కు నిధులు ఇచ్చేలా ఎంపీలు నిల‌దీయాల‌ని దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. జాతీయ పార్టీగా పార్లమెంటులో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ సూచ‌న‌లు చేశారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిచాలని కేసీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ స‌మావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. ఈ సంద‌ర్భంగా పార్టీ ఎంపీల‌తో కేసీఆర్ మాట్లాడుతూ... కేంద్ర అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని ఎంపీలకు చెప్పారు. అదేస‌మ‌యంలో దేశవ్యాప్తంగా గవర్నర్ల తీరుపై పార్లమెంటులో గళం విప్పాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఎప్పట్లాగే రాజీలేని పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ప్రజల కష్టార్జితాన్ని మోడీ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెట్టుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్నారన్నారు. కంపెనీల డొల్లతనం బయటపడి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతోందని ఎంపీలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర ఆర్థిక విధానాలపై ఉభయసభల్లో గొంతెత్తాలని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందన్నారు. ఈ విష‌యంలో క‌లిసి వ‌చ్చే ఎంపీల‌తో సంయుక్తంగా పార్ల‌మెంటులో పోరాడాల‌ని ఆయ‌న సూచించారు.

కాగా, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు సాగుతాయి. తొలి రోజు ఈ నెల 31న‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.