ఈ 45 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు బహుళ నాయకత్వ సమస్య!

Thu Jul 07 2022 11:02:28 GMT+0530 (IST)

TRS problems in these constituencies!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరు ముదురుతోందని వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి అన్ని పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారిందని చెప్పుకుంటున్నారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వ సమస్య ఉందని ప్రధాన మీడియాలో సైతం వార్తలు వస్తుండటం ఇందుకు నిదర్శనం. మరో 20 నియోజకవర్గాల్లోనూ సమస్య ఉందని అంటున్నారు.2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి.. మళ్లీ రెండోసారి వరుసగా 2018లో అధికారం సాధించినప్పటి నుంచి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది. ఆయా పార్టీల నేతలకు తాయిలాలు ప్రకటించి టీఆర్ఎస్ లో చేర్చుకుంది. దీంతో ఆయా పార్టీల్లో కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో మొత్తం 45 నియోజకవర్గాల్లో తమకు ఎమ్మెల్యే సీటు అంటే తమకని ఆ నేతలు తన్నులాటకు దిగుతున్నారని చర్చ జరుగుతోంది.

ఇప్పటికే కొంతమంది వచ్చే ఎన్నికల్లో తమకు సీటు దక్కదని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి నల్లాల ఓదెలు (చెన్నూరు) బూడిద భిక్షమయ్య (ఆలేరు) విజయారెడ్డి (ఖైరతాబాద్) తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో తమకు సీటు దక్కదనుకునే సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేతలు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. దీంతో నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఇక కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తాండూరులో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఉప్పల్ లో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ల మధ్య తీవ్ర స్థాయి విభేదాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. వీరంతా టీఆర్ఎస్ నేతలే కావడం గమనార్హం. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్ నకిరేకల్ తదితర నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. రేగ కాంతారావు పాయం వెంకటేశ్వర్లు (పినపాక) భానోత్ హరిప్రియ కోరం కనకయ్య (ఇల్లందు) వనమా వెంకటేశ్వర్‌రావు జలగం వెంకటరావు (కొత్తగూడెం) కందాల ఉపేందర్‌రెడ్డి తుమ్మల నాగేశ్వర్‌రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారని చెబుతున్నారు.

అలాగే స్టేషన్ ఘన్ పూర్ (రాజయ్య - కడియం శ్రీహరి) ఆసిఫాబాద్ (ఆత్రం సక్కు-కోవా లక్ష్మి) మహబూబాబాద్ (కవిత - శంకర్ నాయక్) నర్సాపూర్ (మదన్ రెడ్డి - సునీతా లక్ష్మారెడ్డి) భువనగిరి (శేఖర్ రెడ్డి - సందీప్ రెడ్డి) ఆదిలాబాద్ (జోగు రామన్న -రంగినేని మనీషా) ల్లోనూ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇవే కాకుండా మెదక్ కొడంగల్ నాగార్జునసాగర్ కోదాడ పటాన్ చెరు ఎల్బీ నగర్ కల్వకుర్తిల్లోనూ టీఆర్ఎస్ కు బహుళ నాయకత్వ సమస్య ఉందని చెప్పుకుంటున్నారు.