ఈటలపై కేసీఆర్ సర్కార్ మరో అస్త్రం

Tue May 04 2021 16:00:02 GMT+0530 (IST)

TRS government has another inquiry on Etela Rajender

మెదక్ జిల్లాలోని రైతుల భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తీసేశారు. ఈ పరిణామం తర్వాత కేసీఆర్ పై తీవ్ర విమర్శలను ఈటల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి కూడా ప్రతిస్పందన వ్యక్తమైంది. మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ లు గట్టిగానే ఈటలకు కౌంటర్ ఇచ్చారు.ఇక మీడియాకు ఎక్కుతూ రచ్చ చేస్తున్న ఈటల రాజేందర్ కు మరో ఉచ్చును కేసీఆర్ సర్కార్ బిగిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈటలను మరో భూవ్యవహారంలో బుక్ చేసేందుకు కేసీఆర్ సర్కార్ రెడీ అయ్యింది.

తాజాగా మేడ్చల్ జిల్లా దేవరయాంజల్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూములను కలెక్టర్ శ్వేతా మహంతి పరీశీలించారు. దేవాలయ భూముల ఆక్రమణలను ఈటల ఆక్రమించారనే ఆరోపణలపై ఐఏఎస్ లతో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

దీంతో ఈటల ఆధీనంలో ఉన్న భూముల్లో గోదాములను అధికారులు పరిశీలించారు. నివేదికను రూపొందించి అక్రమాలు జరిగాయా? లేదా అన్నది నిగ్గు తేల్చనున్నారు.

ఈ దేవరయాంజల్ దేవాలయానికి 1521 ఎకరాల 13 గుంటల భూమి ఉందని దేవాదాయ శాఖ చెబుతోంది. ఇందులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈటల చుట్టూ మరో భూ వ్యవహారం బిగుసుకునేలా కనిపిస్తోంది.