Begin typing your search above and press return to search.

ఆ పార్టీల‌కు షాక్‌..! కొండాతో బీజేపీలోకి వెళ్లేది వీళ్లేనా..!

By:  Tupaki Desk   |   30 Jun 2022 4:30 PM GMT
ఆ పార్టీల‌కు షాక్‌..! కొండాతో బీజేపీలోకి వెళ్లేది వీళ్లేనా..!
X
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీలో చేరిక ఖ‌రారైంది. రెండు మూడు రోజుల్లో మోదీ స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇన్నాళ్లూ ఊగిస‌లాట ధోర‌ణితో త‌ట‌స్థ వైఖ‌రి ప్ర‌ద‌ర్శించిన కొండా ఇపుడు క‌మ‌లం గూటికి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో బీజేపీ శ్రేణుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే కొండా ఒక్క‌రే కాకుండా ఆయ‌న‌తో పాటు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నుంచి కీల‌క నేత‌లు క‌మ‌లం కండువా క‌ప్పుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. వారెవ‌రు అనే దానిపై అన్ని పార్టీల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

2014 ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కేసీఆర్ విధానాలు న‌చ్చ‌క పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ త‌ర‌పున‌ అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ విధానాలు న‌చ్చ‌క రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచీ ఏ పార్టీలో చేర‌కుండా త‌ట‌స్థంగా ఉంటున్నారు. అన్ని పార్టీల ప్ర‌ముఖుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్న కొండా అటు రేవంత్ రెడ్డితో.. ఇటు బండి సంజ‌య్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు చివ‌రికి క‌మ‌లం వైపే మొగ్గు చూపారు.

అయితే.. ఈయ‌న‌తో పాటు ఇత‌ర పార్టీల్లోని కొంద‌రు ముఖ్య నేత‌లు కూడా ఒకేసారి క‌లిసి బీజేపీలో చేర‌బోతున్న‌ట్లు స‌మాచారం. బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో ఉన్న‌పుడు చేరిక‌ల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆయ‌న‌కు అందించారు. అప్ప‌ట్లోనే ప‌లు పార్టీల కీలక నేత‌ల‌తో బండి దూత‌గా కొండా చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపీకి ఊపు తెచ్చే విధంగా అంద‌రూ ఒకేసారి చేరి ఆయా పార్టీల‌కు షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ల‌లోని అసంతృప్త నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. సొంత పార్టీ విధానాలు న‌చ్చ‌క ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్ కు దూరం పాటిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి, మాజీ మంత్రి పీజేఆర్ త‌న‌యుడు విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి, ఇంకా కాంగ్రెస్ లోని ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే అధికార పార్టీ నుంచి ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి వంటి బిగ్ షాట్ ల‌తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా క‌మ‌లం గూటికి చేరబోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదే నిజ‌మైతే అది టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌కు పెద్ద షాక్ అనే చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని.. అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని భావిస్తున్న మోదీ షా ద్వ‌యానికి ఎన‌లేని శ‌క్తిని తెచ్చిపెట్టేదే. మ‌రి వీరంద‌రూ నిజంగానే బీజేపీలోకి వెళ‌తారా..? లేదా ఆయా పార్టీల‌ను బెదిరించ‌డానికే లీకులు ఇస్తున్నారా..? ఇవ‌న్నీ ఊహాగానాలేనా అనే విష‌యం కొద్ది రోజుల్లో తెలియ‌నుంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!