Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్.. జూపల్లి ఇంటి వద్ద ఎదురుచూపులు.. కొల్లాపూర్ లో టెన్షన్

By:  Tupaki Desk   |   26 Jun 2022 6:30 AM GMT
ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్.. జూపల్లి ఇంటి వద్ద ఎదురుచూపులు.. కొల్లాపూర్ లో టెన్షన్
X
టీఆర్ఎస్ లో మళ్లీ సెగలు పొగలు వస్తున్నాయి. అసమ్మతి చెలరేగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిల పరస్పర సవాళ్లు ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న ఈ ఇద్దరు నేతలు.. కొల్లాపూర్ అంబేద్కర్ సెంటర్ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్ధమయ్యారు. డేట్, టైమ్ ఫిక్స్ చేసుకొని మరీ సవాళ్లు విసిరారు.

ఈ సవాళ్ల మేరకు ఇవాళ మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కొల్లాపూర్ పట్టణానికి వచ్చారు. వీరిద్దరి రాకతో కొల్లాపూర్ లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. వీరి సవాళ్ల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు.. ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు.

ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. జూపల్లితో చర్చకు తాము సిద్ధమని .. అంబేద్కర్ చౌరైస్తాకు ఎందుకు రావడం లేదని హర్షవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇక జూపల్లి ఇంటికి తప్పక వెళతానని హర్షవర్ధన్ రెడ్డి భీష్మించుకొని కూర్చోవడంతో నాగర్ కర్నూల్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఆరోపణలపై జూపల్లి అంతే ఘాటుగా స్పందించారు. తనపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. ఆరోపణలు నిరూపణకు 15 రోజులు గడువు ఇచ్చారు. స్థలం , సమయం నిర్ణయించాలని కోరారు. ఇంత చెప్పినా హర్షవర్ధన్ స్పందించలేదు.

చివరకు అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు సిద్ధమా? ఇరువురు సవాళ్లు విసురుకున్నారు. జూపల్లి ఇంటికే ఎమ్మెల్యే హర్షవర్ధన్ వెళతాననడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి హౌస్ అరెస్ట్ చేశారు. రాకపోతే ప్రెస్ మీట్ పెట్టి మీడియా వేదికగా నిర్ణయిస్తే చర్చకు సిద్ధం అని జూపల్లి సైతం తొడగొట్టడంతో నాగర్ కర్నూల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.