Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ను రావొద్దంటారా? టీఆర్ ఎస్ నేత ఫైర్!

By:  Tupaki Desk   |   15 Jun 2019 12:04 PM GMT
జ‌గ‌న్ ను రావొద్దంటారా?  టీఆర్ ఎస్ నేత ఫైర్!
X
కాలం భ‌లే సిత్ర‌మైంది. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు మార‌తాయో అస్స‌లు అర్థం కాదు. ఒక‌ప్పుడు త‌న తండ్రి మ‌ర‌ణం కార‌ణంగా వేద‌న‌తో మ‌ర‌ణించిన కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు చేప‌ట్టిన ఓదార్పు యాత్ర కోసం తెలంగాణ‌లో అడుగు పెట్టాల‌ని భావించిన జ‌గ‌న్ మీద టీఆర్ ఎస్ నేత‌లు ఎంత‌లా విరుచుకుప‌డ్డారో.. మ‌రెంత ర‌చ్చ చేశారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఆ రోజు ఏ జ‌గ‌న్ గురించి అంత గంద‌ర‌గోళానికి పాల్ప‌డ్డారో.. ఇప్పుడు అదే జ‌గ‌న్ ను తెలంగాణ‌కు రావొద్ద‌ని స‌ల‌హా ఇవ్వ‌టాన్ని మండిప‌డిన వైనం చూస్తే ఆయ‌స‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ను ప్ర‌త్యేక అతిధిగా పిల‌వాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిసైడ్ కావ‌టం తెలిసిందే. దీనికి సంబంధించిన ఇన్విటేష‌న్ కార్డు ఇచ్చేందుకు కేసీఆర్ ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తికి వెళ్ల‌నున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ‌గ‌న్ ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభానికి రావొద్ద‌ని.. వ‌స్తే.. ఆయ‌న తండ్రి వైఎస్ ను అవ‌మానించిన‌ట్లు అవుతుంద‌ని టీ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టును కాద‌ని.. రీడిజైన్ చేసింది కాళేశ్వ‌రం ప్రాజెక్టు అని.. తండ్రి స్టార్ట్ చేసిన ప్రాజెక్టును కేసీఆర్ త‌న‌కు తోచిన‌ట్లు మార్చార‌ని.. ఇలా మార్చ‌టం క‌చ్ఛితంగా వైఎస్ ను అవ‌మానించ‌ట‌మేన‌ని వారు వాదిస్తున్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్ హాజ‌రైతే.. ఆ మైలేజీనే వేర‌న్నట్లుగా ఉన్న కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు గండి ప‌డేలా కొత్త వాద‌న తెర మీద‌కు రావ‌టంతో గులాబీ నేత‌లు అలెర్ట్ అయ్యారు. జ‌గ‌న్ ను రావొద్దంటున్న కాంగ్రెస్ నేత‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. జ‌గ‌న్ ను రావొద్దంటున్న కాంగ్రెస్ నేత‌లు అన‌టం వారి కుటిల నీతికి నిద‌ర్శ‌నంగా టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ను రావొద్దంటున్న కాంగ్రెస్ నేత‌లు మోడీ ప్ర‌మాణ స్వీకారానికి సోనియా.. రాహుల్ హాజ‌రు కావటాన్ని కూడా త‌ప్పు ప‌డుతున్నారా? అంటూ అత‌క‌ని పోలిక‌ను చెప్పి.. జ‌గ‌న్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి రావాల‌న్న మాట‌ను చెప్ప‌టం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ రాక కోసం తెలంగాణ నేత‌లు వాడివేడిగా వాద‌న‌లు చేసుకుంటున్న వేళ‌.. ఈ అంశంపై జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.