Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ టాక్స్‌ : మ‌రో అమ్మ‌కంలో మోడీ!

By:  Tupaki Desk   |   17 May 2022 11:44 AM GMT
టీఆర్ఎస్ టాక్స్‌ : మ‌రో అమ్మ‌కంలో మోడీ!
X
ఇప్ప‌టికే ఆంధ్రావ‌నిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాల‌ని, ప్ర‌యివేటీక‌రించి త‌ద్వారా తాము చేతులు దులుపుకోవాల‌ని భావిస్తున్న కేంద్రం మ‌రో ఎత్తుగ‌డ వేసింద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి అంటోంది. ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంద‌ని చెబుతోంది.

సీసీఐని పునఃప్రారంభించి ఉపాధిని కొనసాగించాలని, ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి సహకరించాలనే తెలంగాణ ప్రభుత్వ వినతిని పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంద‌ని ఆరోపిస్తుంది.

దీని ద్వారా వేల కుటుంబాల‌కు ప్ర‌త్య‌క్షంగా మ‌రియు ప‌రోక్షంగా ఉపాధి ఉంటుంద‌ని అయినా కూడా తాము చెప్పినా కూడా త‌మ‌కు తెలియ‌కుండా అమ్మ‌కాల‌కు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని మండిపడిపోతోంది.

ఇప్ప‌టికే త‌మ‌కు తెలియ‌కుండా యంత్ర సామాగ్రి అమ్మ‌కానికి సిగ్న‌ల్ ఇచ్చింద‌ని పేర్కొంటూ..దీనిపై త‌మ‌కు స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేద‌ని అంటోంది. వాస్త‌వానికి సీసీఐ పున‌రుద్ధ‌ర‌ణ‌కు తాము ముందుకు వచ్చిన‌ప్ప‌టికీ కేంద్రం నుంచి ఎటువంటి భ‌రోసా కూడా ద‌క్క‌లేద‌ని కూడా చెబుతోంది. మారుమూల గిరిజ‌న తండాల‌కు అన్నం పెట్టే సంస్థ‌ను ఈ విధంగా నిర్వీర్యం చేయ‌డం త‌గ‌దనే చెబుతోంది. సీసీఐను త‌క్ష‌ణమే పున‌రుద్ధ‌రించాల‌ని కూడా కోరుతూ ఉంది.

వాస్త‌వానికి మోడీ స‌ర్కారు అధికారంలో వ‌చ్చాక ప్ర‌భుత్వ రంగంలో పెట్టుబడుల‌న్నీ ఉప‌సంహ‌ర‌ణ‌కే ప్రాధాన్యం ఇస్తోంది. ఆ విధంగా ఇప్ప‌టికే వైజాగ్ స్టీల్ విష‌య‌మై క‌ఠిన నిర్ణ‌యం ఒక‌టి తీసుకుంది.

విభ‌జ‌న హామీల నెర‌వేర్పు అటుంచి రెండు తెలుగు రాష్ట్రాల‌కూ అన్యాయ‌మే చేస్తోంది. న‌ష్టాల పేరిట కంపెనీల‌ను మూత వేయించి, వాటిని కార్పొరేట్ శ‌క్తుల‌కు క‌ట్ట‌బెడుతుంద‌న్న వాద‌న ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స‌మితి సైతం బ‌లీయంగా వినిపిస్తోంది.