Begin typing your search above and press return to search.

అంతుచిక్కని ఓటరు నాడి.. ఆందోళనలో టీఆర్‌ఎస్, బీజేపీ!

By:  Tupaki Desk   |   24 Oct 2021 2:30 AM GMT
అంతుచిక్కని ఓటరు నాడి..  ఆందోళనలో టీఆర్‌ఎస్, బీజేపీ!
X
ఓటర్లు మారారు గురు...! వారి మనోగతాన్ని బయటపెట్టకుండా గుంభనంగా ఉంటున్నారు. ఏ పార్టీని దూరం చేసుకుండా అన్ని పార్టీలు ఇస్తున్న విందు, వినోదాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం టీఆర్‌ఎస్ క్యాంప్‌లో కనిపిస్తున్నారు. సాయంత్రం బీజేపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. నేడు ఓ పార్టీ కండువా కప్పుకుని ప్రచారంలో పాల్గొంటున్నారు. తెల్లారి మరో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఓటర్లు వ్యవహారశైలి ఓ పట్టాన పార్టీలకు అర్థం కావడం లేదు. ఎవరికి ఓటు వేస్తారో? ఎవరివైపు ఉన్నారో తెలుసుకోలేక పార్టీలు జుట్టు పీక్కుంటున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీ ఓటరు నాడిని పట్టుకోవడం విఫలం చెందాయి. ఓటర్లు తమ అభిప్రాయాన్ని బాహాటంగా వ్యక్తం చేయడం లేదు. నామినేషన్ల ఘట్టం పూర్తయి ప్రచార పర్వం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల నాయకులు అంతా ఓటర్ల తీర్పు ఎలా ఉండ బోతుందో అని తర్జనభర్జన పడుతున్నారు. గతంలో పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది బాహాటం చెప్పేవారు. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఓటరు మనోగతాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్నాడు. మనసులో మాటను బహిరంగంగా చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని జాగ్రత్త పడుతున్నారు. గతంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సానుభూతిగా కొందరు మాట్లాడితే ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడటం లేదు. పెదవి దాటితే ఏమైతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఎవరిని కాదనలేక ఏ పార్టీ నాయకులు ప్రచారానికి వస్తే వారికే జై కొడుతున్నారు. ఉదయం పూట ఒక పార్టీకి జై కొడుతూ, సాయంత్రానికి మరో పార్టీతో తిరుగుతున్నారు. ఉదయం ఒక పార్టీ ప్రచారంలో, సాయంత్రంకల్లా మరో పార్టీ ప్రచారంలో హల్‌చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక పార్టీ కండువా వేసుకుంటే, తెల్లవారితే మరో పార్టీ కండువ కప్పుకుని ప్రచారంలో ప్రత్యక్షమవుతున్నారు. ఓటర్లు ఇలా వ్యవహారిస్తుండడంతో వారి మనోగతం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏ పార్టీ సమావేశం నిర్వహించినా తండోపతండాలు జనం తరలివస్తున్నారు. పార్టీలు ఇస్తున్న విందును ఆరాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అన్ని తమవేననే విధంగా అందరికీ జై కొడుతున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ఓటరు నాడిని పట్టలేక సతమతవుతున్నారు. చివరికి సర్వే చేస్తున్న సంస్థలకు కూడా ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా, ఓటరు తీరు నాయకులను తీవ్రంగా కలవర పెడుతోంది. పైకి గెలుపు మాదంటే మాది అని ధీమా చెప్పుకుంటున్న పార్టీలకు... గెలుపు ఎవరిని వరిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. అందరి దృష్టి అనడం కంటే పార్టీలన్నీ అందరూ అటు వైపు ఆసక్తి చూసే విధంగా చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రచారం తారా స్థాయికి చేరింది. ఆయా పార్టీల క్యాంపెయినర్లతో ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. నాయకులందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ శిబిరం నుంచి ప్రచారం చేస్తున్నారు. దాదాపుగా నియోజకవర్గంలో సుమారు ఏడు వేల మంది టీఆర్‌ఎస్‌ పక్షాన ప్రచారంలో చేస్తున్నారని సమాచారం. బీజేపీ తరపున కూడా భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందనరావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి సహా ముఖ్యనేతలు హుజరాబాద్‌లో మకాం వేశారు.