ఉద్యోగుల్లో చీలిక తేవటంలో సీఎం సక్సెస్ అయ్యారా?

Mon Oct 14 2019 12:23:19 GMT+0530 (IST)

కష్టం వచ్చినప్పుడు ఒక గూటి పక్షులంతా ఒకటి అవుతాయి. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఎపిసోడ్ లో అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి మాటలే నిదర్శనంగా చెబుతున్నారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తో పాటు పలు ఇతర అంశాలతో సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన తొమ్మిది రోజులుగా జరుగుతున్న సమ్మె అంతకంతకూ ముదురుతున్న వేళ.. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలవాలంటూ టీఎన్జీవోల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటివేళ.. సంఘ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి.. చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఆర్టీసీ ఉద్యోగులు తమను సంప్రదించకుండానే తమను ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు.గతంలో ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇప్పించటంలో తమ సంఘం కీలక భూమిక పోషించిందని చెప్పిన కారెం.. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ముందు మాట వరసకు కూడా తమకేమీ చెప్పలేదన్నారు. ఇప్పుడేమో తమను బాధ్యుల్ని చేయటం సరికాదన్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత ఉద్యోగుల సమస్యలపై కూర్చుందామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారని.. ఆ మాటను తాము నమ్ముతున్నట్లు చెప్పారు. తాజాగా కారం రవీందర్ మాటలు ఉద్యోగ సంఘాల మధ్య చీలిక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమకు సంబంధం లేదన్న విషయాన్ని తాజా ప్రెస్ మీట్ తో ఆయన స్పష్టం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. ఉద్యోగ సంఘాలన్ని ఐక్యతతో ఒకేతాటి మీద ఉండకుండా చేయటంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.