వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్ చేసిన టీడీపీ మహిళలు

Wed Nov 24 2021 20:00:02 GMT+0530 (IST)

TDP women performing Half Saree Ceremony for YCP

వినూత్నంగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు. గత వారం ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.దీనిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటం..కన్నీళ్లు పెట్టుకోవటంపై రాజకీయ చర్చగా మారింది. ఈ ఉదంతం చోటు చేసుకున్న వెంటనే చంద్రబాబు కన్నీళ్లను సైతం కొందరు వైసీపీ నేతలు ఎటకారం ఆడేస్తే.. మరికొందరు ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.

వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళలు కొందరు వినూత్నంగా ఆలోచించారు. చంద్రబాబుపై తరచూ విరుచుకుపడే కొందరు నేతల్ని ఎంపిక చేసుకొని.. వారి ముఖాలతో కూడి మాస్కుల్ని ధరించి.. వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్ ను నిర్వహించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలతోపాటు మంత్రులు కొడాలి నాని.. వైసీపీ నేతలు అంబటి రాంబాబుతో పాటు.. వల్లభనేని వంశీలు ఉన్నారు.

ఈ నేతల ఫోటోల్ని ముఖానికి తగిలించుకొన్నారు తెలుగుదేశం పార్టీ మహిళలు. వారి చేతులకు గాజులు వేసి.. ఓణీల ఫంక్షన్ చేపట్టారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకొని తమ అధినేత చంద్రబాబుకు క్షమాణలు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహంతో ఘాటు విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విజయసాయి విశాఖను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతలకు నిరసనలు.. ఆందోళనలు మామూలే కానీ.. ఈ తరహాలో నిరసన మాత్రం వినూత్నమని చెప్పకతప్పదు.