Begin typing your search above and press return to search.

టీడీపీ ట్వీట్ నిజం కాదా? ఫేకా?

By:  Tupaki Desk   |   29 Jun 2022 10:30 AM GMT
టీడీపీ ట్వీట్ నిజం కాదా?  ఫేకా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైఎస్సార్సీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు తీవ్ర స్థాయిలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న ప్ర‌తి త‌ప్పుని బ‌య‌ట‌కు తీసి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ చేసింద‌ని చెబుతున్న ట్వీట్ నిజం కాద‌ని ఫేక్ అని అంటున్నారు. ఎవ‌రో ప్ర‌భుత్వానికి, టీడీపీకి మ‌ధ్య విబేధాలు రాజేస్తున్నార‌ని చెబుతున్నారు. సాంకేతికంగా ప‌ట్టు ఉన్న‌వారు ఇలాంటి ఫేక్ ట్వీట్లు సృష్టిస్తున్నార‌ని వివ‌రిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుపై టార్పాలిన్ కవర్ కప్పి ఉంచిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సుపై టార్పాలిన్ కవర్ కప్పాల్సిన అవసరమేమొచ్చిందనే ప్రశ్నలూ జ‌నాల‌కు తలెత్తాయి. ఆ బ‌స్సులో ఏదో త‌ర‌లిస్తున్నార‌ని.. అందుకే దానిపై టార్పాలిన్ క‌వ‌ర్ క‌ప్పార‌నే విమ‌ర్శ‌లు రేగాయి. దీన్ని టీడీపీ అందిపుచ్చుకుని ఒక ట్వీట్ చేసింది. టార్పాలిన్ క‌వ‌ర్ క‌ప్పి ఆ బ‌స్సులో వేటినో రవాణా చేస్తున్నార‌న్న‌ట్టు త‌న ట్వీట్ లో పేర్కొంది.

దీనిపై ఏపీఎస్ ఆర్టీసీ మండిప‌డింది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి పిల్ల‌ల‌కు ఇవ్వాల్సిన పాఠ్య‌పుస్త‌కాల‌ను బ‌స్సులో త‌ర‌లిస్తున్నామ‌ని.,. వ‌ర్షం ప‌డి పుస్త‌కాలు పాడ‌వ‌కుండా టార్పాలిన్ క‌వ‌ర్ క‌ప్పామ‌ని టీడీపీ సోష‌ల్ మీడియా వింగ్ ను ట్యాగు చేస్తూ ఘాటు రిప్లై ఇచ్చింది.

దీంతో సదరు బస్సులో ప్రయాణికులు కాకుండా ఇంకేదో ఉందనే ప్రచారం జరిగింది. ఇదే అదనుగా విపక్ష టీడీపీ దీన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆర్టీసీ బస్సుపై టార్పలిన్ కప్పి ఏదో రవాణా చేస్తున్నారనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది. ఆ బస్సులో ప్రయాణికులు లేరని, బస్సులో లీకులు కూడా లేవని స్ప‌ష్ట‌త ఇచ్చింది. రాష్ట్ర‌ విద్యాశాఖ ఆదేశాలతో పుస్తకాలను మాత్రమే అందులో తరలిస్తున్నామని పేర్కొంది. దీంతో ఆర్టీసీ ఆగ్ర‌హించ‌డంతో టీడీపీ సోష‌ల్ మీడియా వింగ్ ఆ ట్వీట్ ను డిలీట్ చేసింద‌ని చెబుతున్నారు.

అంతేకాకుండా విద్యార్దుల పుస్తకాలపై శ్రద్ధ వహించినందుకు ఆర్టీసీకి అభినందన‌లు కూడా చెప్పింద‌ని అంటున్నారు. ఎందుకు పట్టాలు కప్పాల్సి వచ్చిందనే విషయం త‌మ‌కు తెలియజేసినందుకు టీడీపీ ఆర్టీసీకి ధన్యవాదాలు చెప్పిందంటున్నారు. ఆర్టీసీపై పెట్టిన పోస్టును డిలీట్ చేస్తున్నామ‌ని కూడా చెప్పింద‌ని స‌మాచారం. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మిడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు వాస్త‌వానికి.. ఆ ట్వీట్ ను టీడీపీ సోష‌ల్ మీడియా వింగ్ చేయలేద‌ని.. టీడీపీ సోష‌ల్ మీడియా వింగ్ పేరుతో ఎవ‌రో మ‌రో ఖాతాని సృష్టించి ఫేక్ ట్వీట్ ను చేశార‌ని టీడీపీ త‌న అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాలో స‌మాధాన‌మిచ్చింద‌ని తెలుస్తోంది.

టీడీపీ చేసినట్లుగా చెబుతున్నట్లుగా చెబుతున్న సదరు ట్వీట్ Telugu Desam Political Wing అనే పేరుతో కనిపిస్తోంద‌ని అంటున్నారు. కానీ వాస్తవంగా టీడీపీ పొలిటికల్ వింగ్ ట్విట్టర్ హ్యాండిల్ TeluguDesamPoliticalWingTDPoliticalWING పేరుతో ఉంటుంద‌ని చెబుతున్నారు. అలాగే ఆర్టీసీ ట్విట్టర్ హ్యాండిల్ లోనూ ఆర్టీసీ బస్సు గురించి కానీ, కవర్ గురించి కానీ ఎలాంటి ట్వీట్లూ కనిపించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ మొత్తం వ్యవహారం ఫేక్ అని అంటున్నారు. ఎవ‌రో కావాల‌నే ఈ ఫేక్ ట్వీట్లు చేస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు.