పవన్ విజయంపై టీడీపీ మీడియా డౌట్స్!

Fri Apr 12 2019 11:21:06 GMT+0530 (IST)

TDP media Doubts on Pawan kalyan Fate in Gajuwaka Constituency

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో గెలుస్తారా? గెలవరా? అనే అంశం గురించి తెలుగుదేశం అనుకూల మీడియానే విశ్లేషణలు మొదలుపెట్టడం విశేషం. పవన్ కల్యాణ్ విజయం మీదే తెలుగుదేశం అనుకూల పత్రికలు ప్రత్యేకమైన విశ్లేషణలు చేశాయి. వాటి ప్రకారం.. పవన్ కల్యాణ్ విజయం అంత ఈజీ కాదని ఆ పత్రికలు పేర్కొనడం విశేషం.తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తాయనే రెండు పత్రికలూ అదే మాటే చెబుతూ ఉన్నాయి. భీమవరం సంగతేమో కానీ.. గాజువాక నుంచి పవన్ కల్యాణ్ గెలిచే అవకాశాలున్నాయనే విశ్లేషణలు ఎన్నికల ముందు వినిపించాయి. అయితే పోలింగ్ అనంతర విశ్లేషణల్లో పవన్ కల్యాణ్ కు గాజువాకలో పరిస్థితి టఫ్ గా ఉందని తెలుగుదేశం మీడియా వర్గాలు వ్యాఖ్యానించడం విశేషం.

వాటి విశ్లేషణల ప్రకారం..గాజువాకలో పవన్ కల్యాణ్ కు గట్టి పోటీ ఎదురైంది. ప్రత్యేకించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కల్యాణ్ కు తీవ్రమైన పోటీని ఇచ్చారు. తెలుగుదేశం అభ్యర్థి కన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే తెలుగుదేశం మీడియా హైలెట్ చేయడం గమనార్హం.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రలోభాలకు గురి చేశారని తెలుగుదేశం అనుకూల మీడియా పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఒకరు ప్రలోభాలకు గురి చేశారు - మరొకరు ప్రలోభ పెట్టలేదు అనడం వితండ వాదనే అవుతుంది. ఎవరికి చేతనైనంత మేర వారు ప్రలోభాలు పెట్టారనేది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం.

పవన్ కల్యాణ్ విజయం గాజువాకలో నల్లేరు మీద నడక కాదు. గట్టి పోటీ కనిపించిందని పోస్ట్ పోల్ అనాలిసిస్ లో తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గాజువాక విషయంలో ఈ మీడియా వర్గాలు అంత ప్రమోట్ చేయలేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా.. పవన్ కల్యాణ్ కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచినే గట్టి పోటీ కనిపించిందని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రముఖంగా పేర్కొంది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.