టీడీపీ నేతలు లోకేశ్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా?

Sun Nov 17 2019 20:00:01 GMT+0530 (IST)

TDP leaders Targets Nara Lokesh

టీడీపీని వీడుతున్న నాయకులు చంద్రబాబు కంటే నారా లోకేశ్ పై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఆయన వల్లే ఆ పార్టీ నాశనమవుతుందని అంటున్నారు. టీడీపీని వీడుతున్న నాయకులు లోకేశ్ ను టార్గెట్ చేయడానికి కారణం గత అయిదేళ్లలో ఆయన వ్యవహరించిన తీరే కారణమని చెబుతున్నారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కీలక - ప్రధాన నిర్ణయాలు అన్నీ చంద్రబాబు - లోకేష్ కనుసన్నల్లోనే సాగాయి. అదే సమయంలో సీనియర్ మంత్రులు - నేతలను కూడా నారా లోకేష్ పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.  నాలుగైదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకూ లోకేష్ దగ్గర కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయట. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఎవరూ ఊహించని రీతిలో 23 సీట్లకు పరిమితమైంది. అంతేకాదు మరోవైపు చంద్రబాబునాయుడి ప్రతిపక్ష హోదా - ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేకుండా చేద్దామని ఓ వైపు వైసీపీ - మరోవైపు బిజెపి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారికంటే టీడీపీలో కీలక నేతలు చాలామంది ఇప్పుడు చంద్రబాబు కంటే నారా లోకేష్ పైనే గుర్రుగా ఉన్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ - నారా లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేశారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని వాళ్ళ చేతిలో పార్టీ నిలబడుతుందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండగా కాంట్రాక్ట్ లు ఇప్పించకపోయినా తాము చెప్పిన పనులు చేయకపోయినా కూడా - పెద్దగా పట్టించుకొనేవాళ్ళం కాదని కానీ లోకేష్ వ్యవహరించిన తీరు ఎక్కువ మంది నేతల మనసును కష్టపెట్టిందన్నది మెజారిటీ నేతల అభిప్రాయమని - కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారట.

పార్టీని వీడాలనుకుంటున్న గంటా లాంటి నేతలు కూడా లోకేష్ నాయకత్వంలో పని చేయడం తమకు ఇష్టం లేదనే చెబుతున్నారు. చాలాకాలం కిందటే టీడీపీని వీడి - ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని కూడా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.