Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలే ఎంపికి షాక్ ఇచ్చారా ?

By:  Tupaki Desk   |   1 Dec 2020 4:30 PM GMT
టీడీపీ నేతలే ఎంపికి షాక్ ఇచ్చారా ?
X
గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కు సొంత పార్టీ నేతలే షాకిచ్చారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెండు రోజుల క్రితం జిల్లాలోని పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారట. ఆ సమయంలో పార్టీ పరిస్దితిపై నేతలు మాట్లాడుతూ ఒక్కసారిగా ఎంపిపై మండిపోయారట. మాట్లాడిన నేతల్లో అత్యధికులు జయదేవ్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయినట్లు సమాచారం. గడచిన ఏడాదిన్నరగా ఎంపి వ్యవహార శైలి వల్లే నేతలకు చాలా గ్యాప్ వచ్చేసిందని మండిపోయారట.

అసలు విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎంపిగా తనకు ఓట్లేయమని అడిగిన జయదేవ్ ఎంఎల్ఏల్లో మీఇష్టం వచ్చిన వాళ్ళకు ఓట్లేసుకోమని అడిగారట. నియోజకవర్గంలోని ప్రముఖులను కలిసినపుడు కూడా జయదేవ్ తనకు మాత్రమే ఓట్లేయాలని చెప్పారట. ఆ విషయం తెలియటంతో అప్పట్లోనే ఎంఎల్ఏ అభ్యర్ధులు, సీనియర్ నేతలతో జయదేవ్ కు పెద్ద గొడవే అయిన విషయాన్ని తాజాగా కొందరు నేతలు చంద్రబాబుకు గుర్తు చేశారట.

వీళ్ళ మధ్య గొడవలు ఇలాగుంటే సీనియర్ నేతల్లో చాలామంది, మాజీ ఎంపి, మాజీ ఎంఎల్ఏలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరని సమాచారం. దూళిపాళ నరేంద్ర, రాయపాటి సాంబశివరావు, ప్రత్తిపాటి పుల్లారావు లాంటి అనేకమంది సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని పిలుపులిస్తున్నా ఎవరు పట్టించుకోవటం లేదు. నేతల్లో పేరుకుపోయిన నైరాశ్యానికి తోడు జయదేవ్ తో పెరిగిపోతున్న గ్యాప్ కూడా ప్రధాన కారణంగా తెలుస్తోందని నేతలు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గల్లాపై ఫిర్యాదులు చేసిన నేతల్లో అత్యధికులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. అంటే సొంత సామాజికవర్గం వాళ్ళకే ఎంపిపై అంత కోపం ఉంటే ఇక మిగిలిన సామాజివకవర్గాల నేతల గురించి చెప్పేదేముంటుంది ? అయితే నేతలు ఎంతమంది ఎంపిపై ఫిర్యాదులు చేస్తున్నా చంద్రబాబు వాటిని పట్టించుకోవటం లేదు. ఈ విషయంలో నేతలు చంద్రబాబు మీద కూడా బాగా కోపంతో ఉన్నారు. కానీ చేయగలిగేది ఏమీ లేదు. అందుకనే పార్టీని వదిలిపెట్టకపోయినా కార్యక్రమాలకు దూరంగా ఉండటం ద్వారా తన నిరసన చెబుతున్నారు. మరి ఈ పరిస్ధితి ఎప్పటికి చక్కబడుతుందో ఏమో.