Begin typing your search above and press return to search.

కంట్లో కన్నీళ్లు తిరుగుతున్న వేళ.. పార్టీ నేత పాడె మోసిన బాబు

By:  Tupaki Desk   |   14 Jan 2022 3:00 PM GMT
కంట్లో కన్నీళ్లు తిరుగుతున్న వేళ.. పార్టీ నేత పాడె మోసిన బాబు
X
ఏపీలో రాజకీయ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయనటానికి తాజాగా మాచర్ల నియోజక వర్గంలో చోటుచేసుకున్న హత్యనే నిదర్శనంగా చెబుతున్నారు. తమ ప్రత్యర్థి పార్టీ జెండాను ఊళ్లో పట్టుకు తిరగటం.. పార్టీకి దన్నుగా నలుగురిని పోగేయటాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు పట్టపగలు.. అందరూ చూస్తుండగా.. నరికి..నరికి చంపేసిన తీరు ఇప్పుడు కలిచివేస్తుంది. ఎంత రాజకీయ వ్యతిరేకత అయినా.. చంపుకోవటం వరకు వెళ్లటమా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యతో తమకే మాత్రం సంబంధం లేదని మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాటలు చెబుతున్నా.. జరిగిన ఉదంతం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

చంద్రయ్య హత్య తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే. కాసేపు అదే నిజమని అనుకుందాం. ఆయన మాటలు అక్షర సత్యాలని భావిద్దాం. మరి.. పట్టపగలు అందరూ చూస్తుండగా నరికి చంపిన వారిలో వైసీపీకి చెందిన ఎంపీపీ.. ఇతర నేతలు ఉన్నారు. అవన్నీ రాజకీయ హత్యలు కావు. వ్యక్తిగతంగా ఉన్న పగలు.. ప్రతీకారాలు అనే అనుకుందాం. స్థానికులు మొదలు కొని పోలీసులకు అందిన హత్యా వీడియోల్ని చూసినతనే హత్య కు పాల్పడిన అనుమానితులపై వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా? అలా ఎందుకు జరగలేదు?

హత్య జరగటానికి కొన్ని గంటల ముందే.. అంటే బుధవారం రాత్రి వేళలో ఎమ్మెల్యే తమ ఊరికి వచ్చారని.. తన తండ్రిని చంపిన వారితో మాట్లాడి వెళ్లారని చంద్రయ్య కొడుకు చెబుతున్నారు. తన కళ్ల ముందు తన తండ్రిని దారుణంగా పొట్టన పెట్టుకుంటుంటే.. ఆపే ప్రయత్నంచేసిన అతగాడిని.. పక్కకు విసిరికొట్టిన వైనాన్ని అతడు చెబుతుంటే .. అయ్యో పాపం అనుకోకుండా ఉండలేం. అన్నింటికి మించి చంద్రయ్యను హత్య చేసే సమయంలో.. హత్యకు పాల్పడిన వారు వేసిన కేకలు.. హెచ్చరించిన హెచ్చరికలు..వైసీపీకి ఈ హత్యతో సంబంధం లేదని ఎలా చెప్పగలరు? వైసీపీ వ్యతిరేకంగా పని చేస్తావా? అంటూ చంపేసిన వేళలో.. తన మాటల్ని మాచర్ల ఎమ్మెల్యే ఎలా సమర్థించుకోగలరు? అన్నది ప్రశ్నలుగా మారాయి.

ఇలాంటి అరుదైన పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు.. పార్టీ అధినేతగా ఉండి కూడా చంద్రయ్య ఇంటికి రావటం.. ఆయన కుటుంబ సభ్యుల్నిఊరడించటమే కాదు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అక్కడి పరిస్థితిని చూసి తీవ్రభావోద్వేగానికి గురైన చంద్రబాబు.. చంద్రయ్య పాడెను స్వయంగా మోయటమే కాదు.. మృతదేహాన్ని ఉంచిన ట్రాలీలో నిలబడి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. చంద్రయ్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చి రూ.25 లక్షలు పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఏమైనా.. చంద్రయ్య హత్య జరిగిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదే సమయంలో.. రాజకీయ విభేదాలు ఉండొచ్చు..కానీ ఇంత దారుణంగా ఉండకూడదన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.