Begin typing your search above and press return to search.

ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ‌-ర‌థ‌యాత్ర‌ల హోరు.. మారిన రాజ‌కీయం తీరు!

By:  Tupaki Desk   |   22 Jan 2021 4:00 AM GMT
ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ‌-ర‌థ‌యాత్ర‌ల హోరు.. మారిన రాజ‌కీయం తీరు!
X
రాష్ట్ర ప్ర‌భుత్వానికి కాక పెరిగింది. జ‌గ‌న్ స‌ర్కారు హిందూసామాజిక వ‌ర్గం విష‌యంలో అనుస‌రిస్తున్న ధోర ‌ణిపై ప్ర‌తిప‌క్షాల దూకుడు మ‌రింత పెరిగింది. నిజానికి ఏ విష‌యంలో అయినా.. ప్ర‌తిప‌క్షాలు కొన్ని లూప్ హోల్స్ ప‌సిగ‌ట్టి ప్ర‌భుత్వంపై పోరు ప్రారంభిస్తాయి. అయితే.. కొన్నాళ్ల త‌ర్వాత స‌ద‌రు వివాదం .. మ‌రో వివాదంతో ఓవ‌ర్ టేక్ అయిపోయి.. మ‌రుగున ప‌డుతుంది. ఇది స‌హ‌జం. దీంతో ప్ర‌భుత్వాలు కూడా ఆయా విమ‌ర్శ‌ల‌ను, వివాదాల‌ను దారి మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నిస్తారు.

కానీ, ఏపీలో ప‌రిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆల‌యాల‌పై జ‌రిగిన దాడులు, విగ్ర‌హాల ధ్వంసం ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌భుత్వం లైట్‌గా తీసుకుంది. మంత్రులు కొంద‌రు విగ్ర‌హాలే క‌దా! అని లైట్ తీసుకున్నారు. ఈ లోగా కీల‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్ట‌డంతో ఈవివాదానికి తెర‌ప‌డుతుంద‌ని సీఎం జ‌గ‌న్ స‌హా కొంద‌రు మంత్రులు కూడా భావించారు. అయితే.. దీనికి భిన్న‌మైన రాజకీయం తెర‌మీదికి వ‌చ్చింది. జ‌గ‌న్ ఊహించ‌ని విధంగా రెండు ప్ర‌ధాన ప‌క్షాలు.. బీజేపీ, టీడీపీలు.. యాత్ర‌ల‌కు రెడీ అయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆల‌యాల‌పై ఉన్న వివాదం మ‌రింత వేడెక్కి.. స‌ర్కారు మెడ‌కు మ‌రింత బిగుసుకోనుంది.

బీజేపీ నేత‌లు.. తిరుప‌తిలోని క‌పిల తీర్థం నుంచి విజ‌య‌న‌గ‌రంలోని రామ‌తీర్థం వ‌ర‌కు ర‌థ‌యాత్ర నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా హిందూ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ యాత్ర పేరుతో తిరుప‌తిలో భారీ ఎత్తున కార్య‌క్ర‌మానికి రెడీ అయింది. దీనికి అనుమ‌తి లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్నా.. ఈ కార్య‌క్ర‌మాన్ని వ‌దిలి పెట్టేది లేద‌ని టీడీపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ రెండు పార్టీలు.. చెరోప‌క్క‌.. నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మం ద్వారా వైసీపీపై భారీ ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు హిందూ సామాజిక వ‌ర్గంపై వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు.. ఆల‌యాల విష‌యంలో చూపిస్తున్న అశ్ర‌ద్ధ‌.. వంటి విష‌యాలు మ‌రింత ప్ర‌చారంలోకి వ‌చ్చి.. మొత్తానికి ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.