Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తుకు సమ్మతి!

By:  Tupaki Desk   |   25 Sep 2021 4:30 AM GMT
జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తుకు సమ్మతి!
X
ఏపీలో జ‌న‌సేన + టీడీపీ కాంబినేష‌న్ రెండు పార్టీల‌కు ఎంత ప్ల‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. 2014 ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన టీడీపీకి స‌పోర్ట్ చేసింది. ఈ క్ర‌మంలోనే కాపులు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు బ‌లంగా ఉన్న చోట టీడీపీ వ‌న్‌సైడ్‌గా విజ‌యం సాధించి.. స‌మైక్య రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వ‌చ్చింది. క‌ట్‌చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఫ‌లితం రెండు పార్టీల‌కు పీడ‌క‌ల‌గా మిగిలిపోయింది. టీడీపీకి చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. చివ‌ర‌కు మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ సైతం మంగ‌ళ‌గిరిలో ఓడిపోయారు. ఇది పార్టీకి, వ్య‌క్తిగ‌తంగా లోకేష్‌కు పెద్ద మ‌చ్చే. ఇక జ‌న‌సేన అధినేత‌గా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్లా ఓడిపోయారు.

క‌ట్ చేస్తే ఆ త‌ర్వాత కొద్ది రోజులకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి మిత్రుడు అయ్యారు. అయితే క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీలు ఎవ్వ‌రూ ఎవ్వ‌రిని గౌర‌వించుక‌వడం లేదు. రెండు పార్టీల నేత‌ల‌కు ఒక‌రిపై మ‌రొక‌రికి న‌మ్మ‌కం పోయింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన + టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు క‌లిసి ప‌ని చేస్తున్నారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో క‌లిసి పోటీ చేసిన చోట వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా ఉండ‌డంతో పాటు మెరుగైన ఫ‌లితాలు సాధించారు. క‌ట్ చేస్తే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్క‌రించింది. ఈ టైంలో టీడీపీ కేడ‌ర్ జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌గా ఆ పార్టీకి మంచి ఓటింగ్ రావ‌డంతో పాటు కొన్ని చోట్ల గెల‌వ‌డంతో పాటు త‌న ఓటింగ్ పెంచుకుంది.

ఇక ఇప్పుడు టీడీపీలో మాజీ మంత్రుల ద‌గ్గ‌ర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌ల వ‌ర‌కు ఒక్క‌టే గానం వినిపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన‌తోనే క‌లిసి న‌డ‌వాల‌ని అధిష్టానానికి సూచ‌న‌లు చేస్తున్నారు. ముఖ్యంగా గోదావ‌రి, కృష్ణా, ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి ఈ స్వ‌రాలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో టీడీపీ నేత‌ల‌కే తెలుస్తోంది. స‌ర్పంచ్‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు చూశాక వ‌చ్చే ఎన్నిక‌ల‌లో వైసీపీని ఒంట‌రిగా ఫేస్ చేయ‌డం క‌ష్ట‌మే అన్న అభిప్రాయం ఆ పార్టీ నేత‌ల‌కు వ‌చ్చేసింది.

అదే స‌మ‌యంలో జ‌న‌సేన పుంజుకుంటోన్న విష‌యం కూడా వారు గ్ర‌హించారు. కొన్ని వ‌ర్గాల ఓట‌ర్ల‌తో పాటు యువ‌త‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పెరుగుతోన్న క్రేజ్ వారు గుర్తిస్తున్నారు. అందుకే జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్లాల‌ని వారు చెపుతున్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన ఎఫెక్ట్ వ‌ల్లే టీడీపీ 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయింది. జ‌న‌సేన‌తో క‌ల‌వ‌క పోతే ఎలా ? న‌ష్ట‌పోతామో వారికి బాగా తెలుసు. అందుకే వారు ఇప్పుడు జ‌నసేన‌తోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో క‌లిసి వెళ్లాల‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెపుతున్నారు.

తాజాగా టీడీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్యం అపహోస్యం చేస్తోన్న వైసీపీకి బుద్ధి చెప్పాలంటే టీడీపీ , జ‌న‌సేన క‌ల‌వాల‌ని చెప్పారు. ఆయ‌న ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో ఈ రెండు పార్టీలు క‌లిసి ప‌ని చేయ‌డంతో జ‌డ్పీటీసీతో పాటు ఎంపీపీ ప‌ద‌విని సైతం గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు క‌లిస్తే ఖ‌చ్చితంగా వైసీపీకి ట‌ఫ్ ఫైట్ త‌ప్ప‌ద‌నే గ్రౌండ్ రిపోర్ట్ కూడా చెపుతోంది. మ‌రి ఈ స‌మీక‌ర‌ణ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఎలా ? మార‌తాయో ? చూడాలి.