సింపతీని గెయిన్ చేద్దాం.. వచ్చే ఎన్నికల్లో గెలిచేద్దాం...!

Thu Nov 25 2021 09:00:02 GMT+0530 (IST)

TDP Sympathy Politics

రాజకీయాల్లో ఎదగాలంటే..సింపతీ కావాలి. అది ఏ రూపంలో వచ్చిందనేది ముఖ్యంకాదు. సింపతీ వచ్చిం దా ? రాలేదా ? అనేదే ప్రధానం. ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇదే ఆలోచన చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు.. సింపతీని ఆయుధంగా వాడుకోవాలని భావిస్తోంది. వాస్తవానికి సింపతీ పాలిటిక్స్ అనేవి టీడీపీకి కొత్తకాదు. 2003లో అప్పటి ఉమ్మడి సీఎంగా ఉన్న చంద్రబాబు.. తన ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని.. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన.. పాదయాత్రకు సింపతీ పెరుగుతోందని గ్రహించారు. దీంతో అనూహ్యంగా తన కారుపై అలిపిరి వద్ద జరిగిన.. మావోయిస్టు బాంబు దాడిని వినియోగించుకున్నారు.తనపై జరిగిన బాంబు దాడి.. అనంతర దృశ్యాలతో తనకు ప్రజల నుంచి సింపతీ వస్తుందని భావించి.. ఆరు మాసాల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లారు. అయితే.. విజయం సాధించలేక పోయారు. అంటే..తాను అనుకున్న సింపతీ రాలేదు. ఇక గత 2014 ఎన్నికల సమయంలో వస్తున్నా మీకోసం అంటూ.. యాత్ర చేపట్టి సింపతీని సాధించారు. అధికారంలో కి వచ్చారు. అయితే.. వైసీపీ అధినేత జగన్.. పాదయాత్ర చేసిన నేపథ్యంలో సింపతీ హవా అటు మళ్లింది. దీంతోచంద్రబాబు.. 2019 ఎన్నికల్లో తాను వృద్ధుడినని.. ఎవరికోసం.. ఇంత సేపు కష్టపడుతున్నానని. ప్రజలను ప్రశ్నించారు.

తన బాధ ఆవేదన అంతా కూడా ఈ రాష్ట్రం కోసమేనని చెప్పుకొచ్చారు. ఈ ఒక్కసారి గెలిపించాలని వంగి వంగి దణ్ణాలు పెట్టారు. అంతేకాదు.. మహిళాలోకాన్ని తనవైపు తిప్పుకొనేందుకు పసుపు-కుంకుమ పంచారు. రూ. 10 వేల చొప్పున ఇచ్చారు. అయితే.. సింపతీ రాలేదు. దీంతో ఆయన ప్రభుత్వం మళ్లీ పడిపోయింది. అయితే.. ఇప్పుడు మరోసారి చంద్రబాబు సింపతీ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ క్రమంలో తనపై జరిగిన మాటల దాడితోపాటు.. తన సతీమణిపై జరిగిన అవమానకర వ్యాఖ్యల దాడిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. తద్వారా సింపతీని గెయిన్ చేయాలని ... చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకూల మీడియా ఈ విషయాన్ని మరింత తీవ్రంగా ప్రచారం చేయనుందని.. సమాచారం. మరి ఈ సింపతీ.. తో చంద్రబాబు పుంజుకుంటారా?   లేక.. సింపతీ వికటిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.