Begin typing your search above and press return to search.

కేశినేని స్ధానంలో అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందేనా ?

By:  Tupaki Desk   |   25 Sep 2021 5:30 AM GMT
కేశినేని స్ధానంలో అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందేనా ?
X
తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన అవసరం వచ్చేస్తోంది. విజయవాడ ఎంపి కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని నానీనే చంద్రబాబునాయుడుతో స్వయంగా చెప్పారట. తానే కాదు తన కుమార్తె కూడా ఎంపిగా పోటీ చేయటంపై ఆసక్తిగా లేదని చెప్పేశారట. ఎందుకంటే కూతురు టాటా ట్రస్టులో ఉద్యోగిగా జాయిన్ అయ్యిందని నాని పార్టీ అధినేతకు స్పష్టంగా చెప్పారట. పైగా కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందిగా దాదాపు నెల క్రిందటే చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే ఎంపికి స్ధానికంగా కొందరు నేతలకు ఏ మాత్రం పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎం పి కి వ్యతిరేకంగా మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగూల్ మీరాలు ఏకమయ్యారు. వీళ్ళ ముగ్గురితో ఎంపికి చాలా కాలంగా ఆధిపత్య పోరాటం జరుగుతోంది. వీళ్ళ పంచాయితీ తీర్చటానికి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు. విషయం ఏదైనా కానీండి ఎంపి అవునంటే వీళ్ళ ముగ్గురు కాదంటున్నారు.

ఈ విషయం ఈమధ్యనే జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టమైంది. తన కూతురుని ఎంపీ మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలని చంద్రబాబుపై ఎంపి బాగా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో చంద్రబాబు కూడా ఎంపి కూతురును మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలని అనకున్నారు. ఈ విషయం బయటకు పొక్కగానే పై ముగ్గురు నేతలు వెళ్ళి చంద్రబాబు దగ్గర కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఎంపి కూతురును మేయర్ అభ్యర్ధిగా ప్రకటించేందుకు లేదని పట్టుబట్టారు.

దీంతో ఈ విషయమై ఎంపికి ముగ్గురు నేతలకు మధ్య బహిరంగంగానే పెద్ద రచ్చయ్యింది. ఒకరిపై మరొకరు మీడియా సమావేశంలోనే ఎంతగా గొడవలు పడ్డారో అందరికీ తెలిసిందే. అయితే చివరకు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకెన్ని గొడవలు అయ్యేవో. అప్పటినుండి వాళ్ళ మధ్య గొడవలు మీడియాలో పెద్దగా కనబడలేదు. అలాంటిది హఠాత్తుగా వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసేది లేదని స్వయంగా ఎంపియే చంద్రబాబుకు చెప్పారనే వార్త పార్టీలో సంచలనంగా మారింది.

నాని ఎంపిగా పోటీచేయకపోతే కొత్త అభ్యర్ధిని వెతుక్కోవటం పార్టీకి కష్టమే. ఎవరో ఒకళ్ళు పోటీకి దిగుతారనటంలో సందేహంలేదు. కానీ గెలుపోటములను పక్కనపెట్టేస్తే ప్రత్యర్ధిని ఢీ కొనేంత స్ధాయి ఉన్న నేత కావాలి కదా. ఇప్పటికే రాజమండ్రి, తిరుపతిలో అభ్యర్ధులను వెతుక్కోవాల్సిన పరిస్ధితి. ఇంకెతమంది మాజీ ఎంపీలు వచ్చే ఎన్నికలకు దూరమని ప్రకటిస్తారో ఏమో చూడాల్సిందే. గెలుపుపై నమ్మకం లేక కొందరు, నేతలతో విభేదాలు పెరిగిపోయి మరికొందరు పోటీకి దూరంగా ఉండాలని డిసైట్ అయినట్లున్నారు. చూద్దాం ఇంకెంతమంది బయటకు వస్తారో.