అప్పొద్దు..పన్నులు వేయొద్దు..బాబు పాలన ఇలానే చేశారా?

Sun Sep 20 2020 06:00:08 GMT+0530 (IST)

TDP Party Leaders Allegations on YS Jagan Government

జగన్ పాలనపై విపక్షం చేస్తున్న విమర్శలు నవ్వుల పాలవుతున్నాయి. సీఎంగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ప్రతిపక్షం టీడీపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదేసమయంలో ఈ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా వర్గాల నుంచి భారీ ఎత్తున వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఈ పరిణామం ప్రభుత్వానికి ఏమేరకు యాంటీగా పనిచేస్తుందో తెలియదు కానీ.. చంద్రబాబుపై మాత్రం మరికొంత వ్యతిరేకత పెరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న మెజారిటీ పథకాలతో ప్రజల వద్దకే ముఖ్యంగా పేదల వద్దకు చేతి వృత్తుల వారికి రైతులకు నిధులు చేరుతున్నాయి.దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసుకుని తంటాలు పడే పరిస్థితి తమకు తప్పిందని ప్రజలే చెబుతున్నారు. మరిఇలా ప్రతి వర్గానికీ.. ప్రభుత్వం నిధులు అందజేస్తున్న సమయంలో ఆర్థిక పరిస్థితి సహజంగానే ఇబ్బందికరంగా మారడం ఖాయం. దీంతో ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు ఆలస్యమవుతున్నాయి. అదేసమయంలో పింఛన్లకు కూడా నిధులను వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో.. ప్రభుత్వం ముందున్న పరిష్కార మార్గాలు రెండే రెండు. ఒకటి అప్పులు తెచ్చుకోవడం. రెండు తప్పని సరి పరిస్థితిలో పన్నులు పెంచడం.

నిజానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ రెండు మార్గాలనే ఎంచుకుంది. కరోనా ఎఫెక్ట్ ఇంకా ప్రారంభం కాకముందుగానే.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 2 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు జీఎస్టీ బకాయిలను ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. అదేసమయంలో యూజర్ చార్జీలను పెంచింది. ఇక ఇప్పుడు మరిన్ని వడ్డనలకు కూడా సిద్ధమైంది. కేంద్రం చేస్తే.. విమర్శించని నాయకులు రాష్ట్రంలో ప్రభుత్వం పడుతూ.. లేస్తున్న క్రమంలో అప్పులు చేస్తే.. వద్దని.. రాష్ట్రాన్ని అప్పుల మయం చేస్తున్నారని రాబడి కోసం.. మద్యంపై పన్నులు వేస్తే.. అది కూడా వద్దని చెబుతుండడం వారికే చెల్లిందని అంటున్నారు సామాన్యులు.

గతంలో చంద్రబాబు ఏ ధరలూ పెంచలేదా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన పాలనలోనూ నిధుల కోసం.. రోడ్డు ట్యాక్స్‌ను పెంచారు. అదేసమయంలో కేంద్రం గ్యాస్ ధర పెంచినప్పుడు రాష్ట్ర వ్యాట్ ను 4 శాతం పెంచారు. దీనిని మరిచిపోయి.. ఇప్పుడు జగన్ సర్కారును బద్నాం చేసే కార్యక్రమం చేపట్టారనేది సామాన్యుల వాదన.  నిజంగానే పన్నులు వేయడాన్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేంద్రమే .. చేతులు ఎత్తేసినప్పుడు.. రాష్ట్రం ఏం చేస్తుంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు.. కేంద్రాన్ని నిలదీసి రావాల్సిన బకాయిలు ఇప్పించి.. అప్పుడు ప్రశ్నిస్తే.. మంచిదనే సూచనలు వస్తున్నాయి. మరి బాబు వింటారా?  ఎదురు దాడి చేయడం తప్ప!!