Begin typing your search above and press return to search.

మహానాడు వేదిక మారిందా ?

By:  Tupaki Desk   |   15 May 2022 8:32 AM GMT
మహానాడు వేదిక మారిందా ?
X
ఈనెల 27,28 తేదీల్లో నిర్వహించబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మారబోతుందా ? పార్టీ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. రెండు రోజుల మహానాడు ఒంగోలు శివార్లలోని త్రోవగుంట ప్రాంతంలోని బృందావనం గార్డెన్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. దాని ప్రకారం పనులు కూడా మొదలయ్యాయి. అయితే హఠాత్తుగా కురిసిన అకాల వర్షాల కారణంగా పై ప్రాంతమంతా బురదగా మారిపోయింది.

ఇప్పటికి పై స్థలం బాగానే ఉన్నా మళ్ళీ మరోసారి వర్షం కురిస్తే మహానాడు నిర్వహణ సాధ్యం కాదని నేతలకు అర్ధమైపోయింది. అందుకనే వేదికను మార్చాలని ప్రకాశం జిల్లా నేతలు భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుకు వివరించారు. దాంతో మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎంఎల్సీ అశోక్ బాబు, ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు తదితర నేతలు ప్రత్యామ్నయ స్ధలాలను పరిశీలించారు.

ఒంగోలు పట్టణంలోని మినీ స్టేడియం అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే వేసవి సెలవుల కారణంగా పిల్లలకు స్టేడియంలో వివిధ క్రీడల్లో శిక్షణా తరగతులు జరుగుతున్న కారణంగా స్టేడియం ఇవ్వటం కుదరదని అధికారులు చెప్పారు. దాంతో చివరగా మద్దిపాడు మండలంలోని గుండాపల్లిలో మహీ ఆగ్రోస్ ప్రైవేటు లిమిటెడ్ స్ధలాన్ని పరిశీలించారు. ఈ స్ధలం అన్ని విధాల సరిపోతుందని నేతలు అనుకున్నారు.

విశాలంగా ఉండే ఈ ప్రాంగణంలో తక్కువలో తక్కువ 30 వేల మంది పడతారని నేతలు అంచనా వేసుకున్నారు. దీని పక్కనే మరో 30 ఎకరాల ఖాళీ స్ధలం ఉంది. దీన్ని బాగు చేస్తే మరో 50 వేల మందికి సరిపోతుందని నేతలు అంచనా వేశారు. ఇదే విషయాన్ని వివరంగా చంద్రబాబుకు వివరించారు. అధినేత ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇక్కడ తప్ప మహానాడు నిర్వహించే స్థాయి వేదికలు కూడా మరోచోట కనబడటం లేదు. అందుకని మహీ ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ స్ధలమే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ రాగానే నిర్వహణ పనులు మొదలుపెట్టి పూర్తి చేయడానికి సీనియర్ నేతలు రెడీ అవుతున్నారు.