గన్‌మెన్ల విషయంలో టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!

Wed Aug 10 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Anantapur district Uravakonda TDP MLA Payyavula Keshav Comments On Jagan Government

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మరోమారు జగన్ ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఖాతాల సంఘం (పీఏసీ) చైర్మన్ గా కూడా ఉన్న పయ్యావుల కేశవ్ కు ఇటీవల జగన్ ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే పయ్యావుల హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా మరోమారు తన భద్రతకు సంబంధించి పయ్యావుల చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి.కావాలనే తన భద్రతకు భంగం వాటిల్లేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పయ్యావుల మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో ఉండేవారికి భద్రత ఇవ్వబోమంటున్న ప్రభుత్వం మరి తెలంగాణలోనే ఉంటున్న వైఎస్సార్సీపీ నేతలకు ఎందుకు భద్రత కల్పిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే తనను లక్ష్యంగా చేసుకున్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

భద్రత పెంచాలని అడిగితే ఇప్పటివరకు పెంచలేదని కేశవ్ విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించి కీలక విషయాలు లేవనెత్తుతున్నారని.. అందుకే మిమ్మల్ని ప్రభుత్వం టార్గెట్ గా చేసుకుందని ఓ కీలక అధికారి తనతో చెప్పారని పయ్యావుల కేశవ్ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలోనే తనపై కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గన్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకుంటే ఆల్ ఇండియా పర్మిట్ కావాలంటూ నాలుగు నెలల నుంచి పెండింగులో పెట్టారని పయ్యావుల ధ్వజమెత్తారు. అలాగే గన్‌మెన్లను ఇతర రాష్ట్రాలకు వద్దంటున్నారని మండిపడ్డారు. గన్ మెన్లను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నక్సలైట్లతో తమ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. తన నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ మిలిటెంట్ల కదలికలు పెరిగాయన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేసిన మాజీ నక్సలైట్లు తన నియోజకవర్గంలో తిరుగుతున్నారన్నారు.

తాను వెలుగులోకి తెస్తున్న విషయాలు.. రాసిన లేఖలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయేమో..?.. అందుకే తనను టార్గెట్ గా చేసుకున్నారేమోనని చెప్పారు. పోరాటాల్లో పుట్టి పెరిగి రాటు తేలిన తాను బెదిరింపులకు భయపడనని తేల్చిచెప్పారు.