అమరావతి ఏరియాలో మేయర్ పాలిటిక్సు

Wed Sep 21 2016 14:54:21 GMT+0530 (IST)

TDP Leaders on Guntur corporation Elections

ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.  అమరావతి నిర్మాణ నేపథ్యంలో గుంటూరు నగరం కూడా భవిష్యత్తులో మరింత కీలకం కానుంది. దీంతో ఎలాగైనా గుంటూరు మేయర్ వశం చేసుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ముఖ్యంగా దీని కోసం టీడీపీలో తీవ్ర పోటీ ఉంది. పోటీయే కాదు... వర్గపోరూ తీవ్రమవుతోంది. మేయర్ - డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వం కోసం సామాజికవర్గాల వారీగా నేతలు చీలిపోయి రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. టీడీపీ మేయర్ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు పేరు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.  మరోవైపు తమకే మేయర్ పదవి ఇవ్వాలని గుంటూరు ఆర్యవైశ్యులు కోరుతున్నారు.  గుంటూరు ఈస్టు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మద్ధాళి గిరిధర్ ఈ దిశగా ప్రయత్నాలు తీవ్రం చేశారు.  కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు సైతం మేయర్ స్థానం తమకే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఇప్పుడున్న పోటీ చాలనట్లుగా మేయర్ అభ్యర్థిత్వంపై తమ మాటే చెల్లుబాటు కావాలంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పట్టుబడుతున్నారు. తమ కేండిడేట్ కు మేయర్ పదవి ఇప్పిస్తానంటే 50కి పైగా కార్పొరేటర్లను గెలిపించుకుంటానని ఆయన చెబుతున్నారు.

దీంతో ఎవరికివారు సామాజిక వర్గాల వారీగా విడిపోయి సమావేశాలు నిర్వహించుకుంటూ తమ బలాన్ని అధిష్టానం ముందు ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు.