Begin typing your search above and press return to search.

అల్లుడి దీక్షే సక్సెస్ అనుకుంటే మరి మామ చేసిందేంటో..!

By:  Tupaki Desk   |   12 Feb 2019 11:45 AM GMT
అల్లుడి దీక్షే సక్సెస్ అనుకుంటే మరి మామ చేసిందేంటో..!
X
ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేశారు. ఫిబ్రవరి 11వ తారీఖున 12 గంటల పాటు ఏపీ భవన్ వేదికగా ప్రత్యేక హోదా కోసమంటూ ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇద్దరు మాజీ ప్రధానులు - ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ తో పాటు పలువురు మాజీ ముఖ్యమంత్రులు - ఇంకొందరు జాతీయ స్థాయి నేతలు వచ్చి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీ కూడా ఏపీ ఈ దేశంలో భాగం కాదా..? అని ప్రధాని మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఒక్కో నాయకుడు రావడం - కొద్ది సేపు మాట్లాడటం - ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇక చంద్రబాబు కూడా ఏపీలో పదే పదే చేసే విమర్శలనే ఢిల్లీలో కూడా వల్లెవేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందనీ - తాను ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడానికి కూడా కమలం పార్టీనే కారణమని చెప్పుకొచ్చారు. గుప్పెడు మట్టి - చెంబుడు నీళ్లు ఏపీ ప్రజల మొఖాన కొట్టారని తెగ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికయినా ఏపీకి న్యాయం చేయాలని మూడు రోజుల గడువిచ్చారు. లేకుంటే ఏపీలో బీజేపీ సర్వనాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టారు. పనిలోపనిగా వైసీపీ మీద కూడా పడ్డారు. ప్రత్యేక హోదా కోసం కలిసి రాకుండా బీజేపీతో వైసీపీ కలిసిపోయిందని ఆరోపణలు చేశారు. మొదటి నుంచి ప్రత్యేక హోదాపై ఒకే మాటకు కట్టుబడి ఉన్న వైసీపీనే.. ప్రధాన దోషిగా చూపే ప్రయత్నం చేశారు.

ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు.. కేంద్రానికి నిరసన తెలియజేయడంపై రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ఇదే రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన దీక్షను - ఎన్టీఆర్ చేసిన దీక్షను ఓ సారి పరిశీలిస్తే... ఉమ్మడి ఏపీకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ తో ఎప్పుడూ ఢీ అంటే ఢీ అనే వైఖరినే అనుసరించేవారు. ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల కోసం - అధిక నిధుల కోసమంటూ రాష్ట్ర మంత్రి వర్గమంతా ఢిల్లీ పార్లమెంట్ ముందు 1987లో ఓసారి నిరాహార దీక్ష చేపట్టారు. ఆ మంత్రివర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ లో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి కూడా ఓ సభ్యుడే. ఆ తర్వాతే అదే డిమాండ్‌ తో 1989వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఎన్టీఆర్ ఆదేశాలతో ఢిల్లీ వేదికగా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నివాసాన్నే టార్గెట్ గా చేసుకుని ఇండియా గేట్ నుంచి టీడీపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. బారికేడ్ లను దాటుకుని మరీ ప్రధాని నివాసం వైపు టీడీపీ నేతలు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఆ నిరసనలో పాల్గొన్న చాలా మంది టీడీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుత టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ - కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు - ఫారూక్.. తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నవారే.

ప్రధాని నివాసానికి దూరంగా ఏపీ భవన్‌ లో సభను ఏర్పాటు చేసి.. దానికే కేంద్రంపై యుద్ధం ప్రకటించాం అంటూ చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారు. ఆ నాడు ఎన్టీఆర్ నేరుగా రంగంలోకి దిగకుండానే తన సభ్యుల ద్వారానే కేంద్రానికి తెలుగోడి దెబ్బ ఏంటో చూపారు. కేంద్రంపై పోరాటం విషయంలో నాటి ఎన్టీఆర్‌ పట్టుదలకు - నేడు చంద్రబాబు వ్యవహరించిన తీరుకు ఎంతో వ్యత్యాసం ఉంది. ‘దమ్ముంటే ప్రధాని నివాసం ముందు దీక్ష చెయ్యండి’ అంటూ వైసీపీ అధినేతను డిమాండ్ చేసే చంద్రబాబు.. తాను మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. కోట్ల కొద్దీ ప్రజాధనంతో, ఏసీ టెంట్ల కింద కూర్చుని చంద్రబాబు తెలిపిన నిరసనకు - లాఠీ దెబ్బల తింటూ తెలిపే నిరసనకు చాలా తేడా ఉంటుందని చంద్రబాబు గుర్తెరగాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా పేరెత్తితే జైల్లో పెడతాం అని నాడు ప్రకటనలు ఇచ్చిన బాబే నేడు ప్రత్యేక హోదాను సాధిస్తామని, అది తమ వల్లే సాధ్యం అని చెప్పడంపై రాజకీయ వర్గాలు ఒకింత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.