ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గంలో టీడీపీలో నాలుగు ముక్కలాట!

Sun Sep 25 2022 12:11:59 GMT+0530 (India Standard Time)

TDP Leaders In Andhrapradesh

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలవగలిగే స్థానం ఏదంటే.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 65 శాతానికి పైగా ఓటర్లు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ఒక్క కారణమే కాకపోయినా గతంలో పెనమలూరు.. ఉయ్యూరు నియోజకవర్గంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు నుంచి అత్యధికసార్లు టీడీపీనే గెలుపొందింది. ఈ కారణంతోనూ పెనమలూరు టీడీపీ సీటు అని చెప్పొచ్చు అంటున్నారు.కాగా గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గెలుపొందారు. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై పార్థసారధి గెలుపొందారు. వాస్తవానికి పెనమలూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరకు కమ్మ సామాజికవర్గానికి చెందిన బోడె ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు.

కాగా వచ్చే ఎన్నికల్లో మరోమారు బోడె ప్రసాద్ పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కూడా ఆయనే ఉన్నారు. అయితే ఆయనకు టీడీపీ నుంచే మరో ఇద్దరు నేతల నుంచి పోటీ ఎదురవుతోంది. గతంలో ఉయ్యూరు సర్పంచ్‌గా ఎమ్మెల్సీగా పనిచేసిన యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీలో మంచి వాగ్ధాటి ఉన్న నేతగా టీవీ చానెళ్ల చర్చల్లోనూ పాపులర్ అయిన నేతగా వైబీ రాజేంద్ర ప్రసాద్‌కు పేరుంది. ఈయన గతంలో నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే సీటు దక్కడం లేదు. చంద్రబాబుకు సన్నిహితుడైన అయిన వైబీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరోవైపు గతంలో ఉయ్యూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చలసాని పండు (వెంకటేశ్వరరావు) మేనల్లుడు దేవినేని గౌతమ్ కూడా వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ మాజీ మంత్రి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు సన్నిహితుడైన గౌతమ్ ఆయన ద్వారా సీటు సాధించాలని తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.అలాగే కూడా లోకేష్ మద్దతు సైతం తనకు ఉందని... టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో ఓవైపు టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మరోవైపు మాజీ ఎమ్మెల్సీ వైవీ రాజేంద్ర ప్రసాద్ ఇంకోవైపు దేవినేని గౌతమ్ ఇలా ముగ్గురు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు చాలదన్నట్టు మాజీ మంత్రి మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరావు మనవడు వడ్డే సాయి కూడా టికెట్ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందనుకునే నియోజకవర్గంలో ఈ నాలుగు ముక్కలాట ఏంటని చంద్రబాబు తలపట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఎవరికి వారే ఈసారి టికెట్ మాకంటే మాకని పోటీపడుతుండటం కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ అధిష్టానంలో పెనమలూరు పెద్ద టెన్షనే సృష్టిస్తోందని చెబుతున్నారు.