టీడీపీ అభ్యర్థుల్లో బాధ.. ఎందుకంటే!

Mon Apr 22 2019 22:00:01 GMT+0530 (IST)

TDP Leaders Feels Bad Inside about Elections Result

సంతాప తీర్మానాలు' అని వ్యంగ్యంగా అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలుగుదేశం పార్టీ మీటింగులను. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడుతున్న మాటల విషయంలో - చేపడుతున్న చర్చలు - చేస్తున్న ఆరోపణల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అలా వ్యంగ్యంగా స్పందించారు.ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర  వ్యాప్తంగా నేతలతో నిర్వహించిన మీటింగ్ కూడా అదే రీతిన సాగిందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరుపై చంద్రబాబు నాయుడు ఈ సమీక్షను నిర్వహించారు.  అందులో నేతలు అంత యాక్టివ్ గా కనిపించలేదు.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని పోలింగ్ ముందు నుంచినే సర్వేలు చెబుతూ ఉన్నాయి. చాలా జాతీయ మీడియా సర్వేలు అదే మాటే చెప్పాయి. అయితే అనుకూల మీడియా ఎన్నికల ముందు పార్టీ నేతల కాన్ఫిడెన్స్ ను కాపాడుకొంటూ వచ్చింది. ఇక పోలింగ్ పూర్తి అయ్యాకా ఆ మీడియా వర్గాలు కూడా మునుపటిలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేయలేకపోతూ ఉన్నాయి.

అవి రకరకాల వాదనలు చెబుతున్నాయి. ఇక చంద్రబాబు సంగతి సరేసరి. ఈవీఎంల మీద బాబు నెపాన్ని నెడుతూ ఉన్నారు.  ఈసీని తిడుతూ ఉన్నారు. ఫలితంగా టీడీపీ ఓటమి ఖరారే అనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతూ ఉంది.

'చంద్రబాబు నాయుడు తను భయపెడుతూ.. మనల్నీ  భయపెడుతున్నారు..' అని సమీక్ష సమావేశంలో కొందరు నేతలు వ్యాఖ్యానించారట.  సమీక్ష సమావేశంలో పైకి ఏం మాట్లాడినా.. లోలోపల మాత్రం ధీమాను వ్యక్తం చేసిన వారు లేరని తెలుస్తోంది.   విజయం వైఎస్సార్సీపీ దే అని కూడా కొందరు నేతలు తమ వాళ్ల దగ్గర ఓపెన్ గా వ్యాఖ్యానించిన దాఖలాలూ కనిపిస్తూ ఉన్నాయి. ఇదీ తెలుగుదేశం పార్టీ పోస్ట్ పోల్ ఎనాలిసిస్ జరిగిన తీరు అని భోగట్టా!