బాలయ్యకు పురంధేశ్వరి షాక్.. ఏం చేశారంటే?

Wed Jun 26 2019 11:40:52 GMT+0530 (IST)

నాన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అదీ..కానీ అందులో ఎన్టీఆర్ వారసులు ఇప్పుడు లేరు. చంద్రబాబు మాత్రమే ఉన్నారు. ఆయన వారసుడే భావి వారసుడు అంటున్నారు. పిల్లనిచ్చిన బాలయ్య మాత్రమే చంద్రబాబుకు అండగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి మాత్రం బాబుకు వ్యతిరేకమైన బీజేపీ పార్టీలో ఉన్నారు.ఏపీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైన వేళ ఇప్పుడు చంద్రబాబును టీడీపీని లేకుండా చేయడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు స్కెచ్ గీసి ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీని లేకుండా చేసే ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు ప్రతిపక్ష కాంగ్రెస్ - ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టి బీజేపీని టార్గెట్ చేసిన బాబుకు దిమ్మదిరిగే షాకులు ఇస్తున్నారు బీజేపీ పెద్దలు.

ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను లాగేసి బాబుకు షాకిచ్చారు. ఇక నిన్ననే టీడీపీ ఏపీ ఫిలించాంబర్ మాజీ చైర్మన్ - సీనియర్ నేత అంబికాకృష్ణకు కమళ కండువా కప్పారు.  ఇక టీడీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలోనే 10 మంది బీజేపీకి లాగాలని యోచిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.

అయితే బీజేపీ పెద్దలు కోపంతో ఇలా చేయడంలో అర్థముంది.అయితే ఇదే బీజేపీలో ఉన్న ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి సైతం టీడీపీని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అంటేనే పడని దగ్గుబాటి పురేంధేశ్వరి-వేంకటేశ్వరరావులు ఇప్పుడు ఎన్టీఆర్ లేని టీడీపీని తుత్తునియలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. కేంద్రంలోని బీజేపీ అండతో తమ ఫ్యామిలీకి దగ్గరై టీడీపీలో ఉన్న నేతలందరినీ బీజేపీలో చేర్చడానికి నడుం బిగించారు. ఇప్పుడు టీడీపీని దెబ్బతీయడంలో తమ వంతు కీలక పాత్ర పోషిస్తుండడం గమనార్హం.

తాజాగా పురంధేశ్వరీ తన సోదరుడు టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యకు గట్టి షాకే ఇచ్చారు.బాలయ్యకు సమీప బంధువు - టీడీపీ నేత పొట్లూరి కృష్ణ బాబును బీజేపీలోకి ఆహ్వానించారు. కృష్ణ బాబు - ఆయన భార్యతో కలిసి బీజేపీలో చేరారు. పొట్లూరి పార్టీ మార్పులో పురంధేశ్వరీ కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఇక బాలయ్య బంధువులైన టీడీపీ నేతలకు కూడా పురంధేశ్వరం బీజేపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారట.. ఇలా టీడీపీని టార్గెట్ చేసి పురంధేశ్వరి వేస్తున్న అడుగులు అటు సోదరుడు బాలయ్యను ఇటు చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.