Begin typing your search above and press return to search.

టీడీపీలో పెరిగిపోతున్న 'వడ్డీ' ల గోల

By:  Tupaki Desk   |   27 Oct 2020 12:30 AM GMT
టీడీపీలో పెరిగిపోతున్న వడ్డీ ల గోల
X
‘జగన్ మోహన్ రెడ్డికి వడ్డీలతో సహా తిరిగి చెల్లిస్తాం’... ఇది తాజాగా తెలుగుదేశంపార్టీ నేతల ప్రతిజ్ఞ. గుంటూరు జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు - జిల్లాలో సమన్వయకర్తలు బాధ్యతలు తీసుకునే సందర్భంగా చెప్పిన మాటలు. ఆమధ్య అనంతపురంలో మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఇంతకింత జగన్ కు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామంటూ మీడియా ముందే చెప్పిన విషయం గుర్తుంటే ఉంటుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస - మాజీ ఎంఎల్ఏ కూనరవి ఎప్పుడు మాట్లాడినా టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ పై ప్రతికారం తీర్చుకుంటామంటు ఎన్నిసార్లు శపథాలు చేశారో లేక్కేలేదు.

నిజానికి తెలుగుదేశంపార్టీ నేతల ధోరణి పేలవంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలన్నాక కేసులు - ప్రతీకార చర్యలు అత్యంత సహజం. ఇది ఒక్క ఏపిలోనే జరగటం లేదు. తమిళనాడు - కర్నాటక - మహారాష్ట్ర - పశ్చిమబెంగాల్ లో కూడా చూస్తున్నదే. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కేంద్రప్రభుత్వం ఒకపుడు ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరు చూసిందే.

పోనీ మిగిలిన రాష్ట్రాల గొడవ మనకెందుకు అనుకున్నా టీడీపీ అధికారంలో ఉన్నపుడు చేసిందేమిటి ? ఎంతమంది వైసీపీ ఎంఎల్ ఏలు - నేతలపై కేసులు పెట్టలేదు ? చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి - తాడిపత్రి ఎంఎల్ ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి - నరసరావుపేట ఎంఎల్ ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి - మంగళగిరి ఎంఎల్ ఏల ఆళ్ళ రామకృష్ణారెడ్డి - నగిరి ఎంఎల్ ఏ రోజా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిపై కేసులు పెట్టింది. వాళ్ళంతా కోర్టుల్లోనో లేకపోతే ప్రజాకోర్టుల్లోనో టీడీపీని ఎదుర్కొన్నారు.

కాబట్టి ఇపుడు టీడీపీ నేతలు చేయాల్సిదేమంటే మాటలు కాదు. తమ కెపాసిటీని చేతల్లో చూపాలి. అసలు జగన్ పై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు ఎలా నమోదయ్యాయి ? 16 మాసాలు ఎందుకు జైల్లో కూర్చున్నాడు ? ఎందుకు ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టుల్లో హాజరయ్యేవాడంటే అన్నింటికీ వేధింపులే కారణమని వైసీపీ నేతలు చెప్పటం లేదా ? జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళకుండా అసలు కేసులు, విచారణే ఉండేదికాదని స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆజాద్ ప్రకటన ప్రకారమే జగన్ పై నమోదైన కేసులు, జరుగుతున్న విచారణంతా రాజకీయ వేధింపులే అని అర్ధమైపోవటం లేదా ?

ఇపుడు టీడీపీ నేతలు అనవసరంగా జగన్ పై నోరుపారేసుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టీడీపీ ఏమి చేస్తుందో చెబితే జనాలు వింటారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేకమైన నిర్ణయాలను వివరిస్తే జనాలకు అర్ధమవుతుంది. అంతేకానీ ప్రతీకారం తీర్చుకుంటామని, వడ్డీకి చక్రవడ్డీతో కలిపి బదులు తీర్చుకుంటామని చెప్పే మాటల వల్ల ఎటువంటి లాభం లేకపోగా తమ ప్రకటనలు, శపథాలు తమకే ఎదురుతిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ టీడీపీని లెక్క చేయలేదు. అలాంటిది అధికారంలో ఉన్నపుడు టీడీపీ నేతల బెదిరింపులను లెక్క చేస్తారా ?