Begin typing your search above and press return to search.

పట్టాభి నోట మళ్ళీ ఆ మాట...?

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:30 PM GMT
పట్టాభి నోట మళ్ళీ ఆ మాట...?
X
ఆయన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. మేధావిగా పేరుంది. సబ్జెక్ట్ మొదలెట్టాడంటే మొత్తం ఆధారాలతో చిట్టా దగ్గర పెట్టుకుంటాడు. గడగడమని మీడియా ముందు మాట్లాడుతూంటే బంపర్ మెజారిటీతో పవర్ లోకి వచ్చిన సర్కార్ పెద్దలకైనా షాకుల మీద షాకులే.

అవును ఆయనే టీడీపీ నేత పట్టాభి. సరిగ్గా రెండు నెలల క్రితం ఆయన చేసిన ఒకే ఒక వ్యాఖ్య ఏపీని మండించేసింది. మరో వైపు మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ దాడితో మంట ఏపీలో ఒక రేంజికి చేరుకుంది. ఏకంగా రాష్ట్రపతిపాలన అంటూ చంద్రబాబు ఢిల్లీ దాకా వెళ్ళేలా చేసింది.

ఒక అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రిని దూషించారు అని వైసీపీ నేతలు పట్టాభి మీద విరుచుకుపడ్డారు. ఆ తరువాత ఆయన అరెస్ట్ కావడం, బెయిల్ మీద వచ్చిన తరువాత కొన్నాళ్ళు ప్రశాంతత కోసమని వేరే చోటకు వెళ్ళడం, ఇపుడు మళ్ళీ ఆయన స్థిమితంగా విజయవాడలోనే ఉంటూ తన పొలిటికల్ యాక్టివిటీని మొదలెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇంతకీ ఇంత మంట పెట్టిన పట్టాభి మాట దాని ముందూ వెనకా కధ ఏంటి అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది. లేటెస్ట్ గా ఒక చానల్ ఇంటర్వ్యూలో వారు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పట్టాభి మరోసారి ఆ మాట వాడారు. అది కూడా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను అంటూ ఆ పదం ఎవరిని ఉద్దేశించి తాను అన్నానో వివరంగా చెప్పుకొచ్చారు.

తాను ముఖ్యమంత్రి జగన్ని అసలు అనలేదని క్లారిటీ ఇచ్చిన పట్టాభి సకల శాఖలను చూస్తూ మంత్రులకే పెద్ద మంత్రిగా వ్యవహరిస్తున్న ఒక ప్రభుత్వ సలహాదారుని ఉద్దేశించి ఆ పదం వాడాల్సి వచ్చిందని, చెప్పారు. తమ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేతకు అర్ధరాత్రి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం మీద ఆవేశపడి తాను అలా అన్నానని వివరణ ఇచ్చారు.

ఆ పదం మంచిదో కాదో తెలుసుకునే ముందు వైసీపీ నేతలనే దాని గురించి అడగాలని పట్టాభి అనడం విశేషం. అంటే వారు ఈ తిట్టుతో సహా చాలా ఎక్కువగానే ఇతర తిట్లు తిట్టారని పట్టాభి అభిప్రాయపడినట్లుంది. ఇదిలా ఉంటే ఆ సంఘటన తరువాత పట్టాభి ఇల్లు అంతా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతావలయంలోకి వెళ్లిపోయింది. మొత్తం ఆరుగురు పోలీసులు, ఇతర సెక్యూరిటీ పట్టాభిని రాత్రీ పగలూ రక్షణగా చూసుకుంటున్నారు. మొత్తానికి పట్టాభి మీద టోటల్ ఫోకస్ ఉందని చెప్పాలి.