Begin typing your search above and press return to search.

పొత్తుల్లేకుండానే టీడీపీ : వైసీపీ కంటే ఎక్కువ సీట్లు

By:  Tupaki Desk   |   26 Jun 2022 8:54 AM GMT
పొత్తుల్లేకుండానే టీడీపీ  : వైసీపీ కంటే ఎక్కువ సీట్లు
X
తెలుగుదేశం పార్టీలో అంతకంతకు ధీమా పెరిగిపోతోంది. పొత్తులు లేకుండానే విజయం సాధిస్తామని ఈ మధ్యన తరచూ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు జబ్బలు చరుస్తున్నారు. ఏపీ జనాలు టీడీపీకి నీరాజనాలు పలుకుతూంటే పొత్తుల గోల ఏలా అని వారు అంటున్నారు. చంద్రబాబునే మళ్లీ సీఎం కావాలని, వైసీపీ అరాచకా పాలన అంతమొందించాలని జనాలు గట్టిగా విశ్వసిస్తున్నాయని కూడా చెబుతున్నారు.

ఇపుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఒక జోస్యం వదిలారు. ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండానే 160 సీట్లు టీడీపీకి వస్తాయని ఇది జరిగి తీరుతుందని ఆయన బల్ల గుద్దారు. టీడీపీ మీద జనాలకు ఉన్న మోజు అది అని ఆయన అంటున్నారు. మూడేళ్ళకే వైసీపీ పాలన వెగటు పుట్టించిన వేళ తమకు జనాలు ఆశీర్వాదం నిండుగా ఉన్న వేళ పొత్తులతో పనేంటి అని కూడా అంటున్నారు.

అంటే సింహం సింగిల్ గా వస్తుంది అని వైసీపీ తరచుగా చెబుతున్న దానిని కాస్తా మార్చి టీడీపీ మాజీ మంత్రి ఇస్తున్న భారీ స్లోగన్ ఇదన్న మాట. మాదే ఈసారి అధికారం, ఎనీ డౌట్స్ అని కూడా అంటున్నారు. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని ఆయన అన్నారు. అది జనాలు గట్టిగా భావిస్తున్నారు అని కూడా చెబుతున్నారు.

ఏపీలో వైసీపీ పాలన మీద వ్యతిరేకత‌తో జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు అంటేనే పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది కదా అని ఆయన తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. వైసీపీ వారి సొంత ప్లీనరీలకే నాయకులు ముఖం చాటేస్తున్న పరిస్థితి ఉందని ప్రత్తిపాటి చెబుతూ ఇక వైసీపీని జనం నమ్మేదే లేదని చెప్పేశారు.

సరే ఇవన్నీ పక్కన పెడితే పొత్తులు త్యాగాలు అంటూ ఇంతకాలం టీడీపీ పెద్దలు చెప్పిన కబుర్లు తీసిన దీర్ఘాలు కధ ఏంటి అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తోంది. సభలకు జనాలు రావడంతోనే గెలిచేశామని తమ్ముళ్లు అతి ధీమా పడుతున్నారా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఒక విధంగా వైసీపీ పని అయిపోయింది, తామే అధికారంలోకి వస్తోందని చెబుతూనే పొత్తులు లేకుండానే పవర్ మాకే అని చెప్పడం జనసేన బీజేపీలకు ఝలక్ ఇవ్వడానికేనా అని కూడా డౌట్లు వస్తున్నాయి.

ఇక టీడీపీ మైండ్ గేమ్ కి పెట్టింది పేరు అని చెబుతారు. పొత్తుల విషయం కొన్నాళ్ళుగా ఏపీలో నానుతోంది. పవన్ అయితే మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు. ఈ టైమ్ లో పొత్తులు లేకుండా అంటూ పదే పదే పసుపు పార్టీ వారు తొడగొడుతున్నారు అంటే నిజంగా సింగిల్ గా వెళ్తారా లేక మిత్రులను తమ దారిలోకి తెచ్చుకునే మైండ్ గేమ్ గా దీనిని చూడాలా అన్న చర్చ కూడా ఉంది. అయినా ప్రత్తిపాటి చెప్పినా మరొకరు చెప్పినా కూడా అసలు జోస్యం జనాల చేతులలో ఉంది. వారు కదా చెప్పాల్సింది. ఇక పొత్తులు లేకపొయినా పవర్ మాదే అని టీడీపీ చెబితే ఆ మాటలు విని జనసేన ఊరకే చూస్తూ ఉంటుందా. ఏమో ఆ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయో.